పార్లమెంటులో సభ్యుల ప్రవర్తన పట్ల రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.కీలక అంశాలపై చర్చలు జరగకుండా సభ్యులు ప్రవర్తిస్తున్న తీరుపై చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయసభలు పలు అంశాలపై చర్చలు జరగకుండా వాయిదాలు పడుతుండటంపై ఆయన బుధవారం రాజ్యసభలో మాట్లాడారు. మరో ఐదు రోజుల్లో శీతాకాల సమావేశాలు ముగియబోతున్నాయి, కానీ సభలో దేని గురించి చర్చ జరగకుండా వాయిదాల పర్వం కొనసాగుతోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.‘సభా కార్యకలాపాలు సక్రమంగా జరగకపోవడం వల్ల ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. ఇది పార్లమెంటు ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది. దయచేసి సభ సజావుగా జరిగేందుకు సహకరించండి. మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. ముమ్మారు తలాక్, రఫేల్ ఒప్పందం వంటి కీలక అంశాల గురించి చర్చ జరగాల్సి ఉంది. కొన్ని తీర్మానాలను ఆమోదించేందుకు దయచేసి సహకరించండి’ అంటూ వెంకయ్యనాయుడు సభ్యులనుద్దేశించి అన్నారు. డిసెంబరు 11న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు ఈనెల 8వ తేదీతో ముగియనున్నాయి. కావేరీ జలాల అంశం, రఫేల్ ఒప్పందాల గురించి కాంగ్రెస్, అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేయడంతో రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. బుధవారం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే కావేరీ నదీ జలాల విషయంలో న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ అన్నాడీఎంకే నేతలు నిరసనకు దిగారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది.