ఉమ్మడి హైకోర్టు విభజనను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే రెండు హైకోర్టులకు సంబంధించి వేర్వేరుగా ప్రమాణ స్వీకారాలు కూడా పూర్తైన నేపథ్యంలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. తొలుత అత్యవసర విచారణ చేపట్టాలన్న అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం కోర్టు... బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ల వాదనను జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఇప్పటికే రెండు హైకోర్టులు ఏర్పాటు కావడంతో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. ఏపీ రాజధాని అమరావతిలో హైకోర్టు భవనాలు, జడ్జిల నివాస సముదాయాలు పూర్తయ్యే వరకు హైకోర్టు విభజన తాత్కాలికంగా వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.