ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు వడ్డేపల్లిలో ఎన్టీఆర్ గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేశంలో రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకోలేని ఏకైక రాష్ట్రం మనదేనని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంతో పోరాడుతున్నామని, ఇప్పటికే 63 శాతం పూర్తయిందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసినట్టు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నట్టు సీఎం వివరించారు.రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాడతానని, వెనక్కి తగ్గే ప్రసక్తేలేదన్నారు. తాను చేస్తున్న పోరాటం తన కోసం కాదని, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసమేనన్నారు. తెలంగాణలో మహాకూటమి ఓడిపోవడంతో తాను ఆక్రోశంతో ఉన్నానని, దేశంలో పెట్టే మహాకూటమి విజయవంతం కాదని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. దేశానికి మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నారు. ప్రమాదంలో పడిన దేశాన్ని కాపాడుకుంటూనే.. మరోవైపు రాష్ట్రానికి న్యాయం చేసుకోవాలన్నారు. అందుకే కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇటీవల తనపై అసభ్యంగా మాట్లాడారని అన్నారు. తన వద్ద మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడినా తాను ప్రజల కోసమే భరిస్తున్నానని చంద్రబాబు అన్నారు. పేదరికం లేని సమాజం చూడాలనేది తన జీవితాశయమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కేంద్ర సంస్థలను ఇవ్వలేదని, ద్రవ్యలోటును పూడ్చలేదని మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధుల్ని సైతం వెనక్కి తీసుకున్నారని దుయ్యబట్టారు. కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టమంటే, పెట్టమనే విధంగా కేంద్రం మాట్లాడితే తామే సాహసం చేసి పరిశ్రమను పెట్టుకొనేందుకు సిద్ధపడ్డామని చంద్రబాబు తెలిపారు