YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

9న ఇచ్చాపురంలో ముగియనున్న జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర

9న ఇచ్చాపురంలో ముగియనున్న జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర జనవరి 9న ముగియనుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 2017 నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పూర్తికానుందని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 134 నియోజవకర్గాల్లో 120 బహిరంగ సభలు, రెండువేలకుపైగా గ్రామాలు, 3500 కి.మీ.పైగా పాదయాత్ర సాగిందని వివరించారు. ‘2019 జనవరి 9వ తేది ఎంతో చారిత్రాత్మక రోజు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఆరోజు ముగియనుంది. పాదయాత్రకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 2 నుంచి సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించి పాదయాత్ర లక్ష్యాలను నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రజలకు వివరిస్తారు. వైఎస్సార్‌ చనిపోయిన తరువాత జగన్‌ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గడిచిన పదేళ్లల్లో ఊహించని సమస్యలు, అక్రమ కేసులు, జైలు జీవితం, హత్యాయత్నం వరకు ఎన్నో కష్టాలను జగన్‌ చవిచూశారు. రాష్ట్ర విభజన తర్వాత మానవ తప్పిదాలు, అసమర్థత కారణంగా రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయింది. 2019 ఎంతో కీలకమైనది. అవినీతి పరుల పాలనకు చరమగీతం పాడి వైఎస్‌ జగన్‌ రాష్ట్రనికి సీఎం కానున్నారు’ అని అన్నారు. ‘పాదయాత్రలో జగన్‌ వేలాది మందిని నేరుగా కలిశారు. ప్రజా సమస్యలు వింటూ, వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తూ పాదయాత్ర సాగించారు. అన్ని వర్గాల ప్రజలును కలుస్తూ ముందుకెళ్లిన పాదయాత్ర విజయం సాధించింది. ఏపీ ప్రజలకు కొత్త ఆశాకిరణం వైఎస్‌ జగన్‌. పాదయాత్రలో వెళ్లలేని ప్రాంతాలను కూడా జగన్‌ కవర్‌ చేస్తారు. బస్సులో పర్యటించాలా, బహిరంగసభలు పెట్టాలా అనే అంశాలపై చర్చ జరుగుతుంది. ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండటానికే ఆయన ప్రయత్నిస్తున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఏమీ చెయ్యని చంద్రబాబు ఎన్నికలకు ముందు హడావిడి చేస్తున్నారు. చంద్రబాబు తీరు చూస్తే మిగిలినవారందరూ దొంగలు నేనే మంచివాడ్నని చెప్పుకుంటున్నారు. కేసీఆర్ ను నేనే కలవాలనుకున్నానని చెప్పిన చంద్రబాబు ఇతరులు కేసీఆర్ ను కలిస్తే కుట్ర అంటున్నారు. మా ప్రథమ ప్రత్యర్ది చంద్రబాబు. పరిపాలన పరంగా విభజన జరిగిందే తప్ప ప్రజల మధ్య విభజన లేదు కాబట్టి కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామంటే సంతోషిస్తాం. చంద్రబాబు అసలు నిజస్వరూపాన్ని ఎవరు బయటపెట్టినా సంతోషిస్తామ’ని వ్యాఖ్యానించారు.

Related Posts