రఫేల్ ఒప్పందంపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రధాని మోదీ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్‌పై జైట్లీ ధ్వజమెత్తారు. కొందరు సహజంగా నిజాలను ఇష్టపడరని జైట్లీ రాహుల్‌ని ఉద్దేశించి అన్నారు. ఆయన రఫేల్ ఒప్పందంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో జరిగిన రక్షణ కుంభకోణాల్లోని కుట్రదారులు ఇప్పుడు మోదీ ప్రభుత్వంపై వేలెత్తి చూపిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా రాహుల్ ఎలా సవాలు చేస్తారని ప్రశ్నించారు. కనీసం యుద్ధ విమానం అంటే ఏంటో తెలియని వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్‌కు అధ్యక్షత వహిస్తున్నారంటూ విమర్శలు చేశారు.కొందరు డబ్బుకు సంబంధించిన విషయాలను బాగా అర్థం చేసుకుంటారు, కానీ జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు అర్థం చేసుకోలేరు అని జైట్లీ దుయ్యబట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసు, అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణాలను లేవనెత్తడంతో పాటు బోఫోర్స్ కుంభకోణంలో దళారిగా వ్యవహరించిన ఖత్రోకీ పేరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. రఫేల్ డీల్‌కు సంబంధించిన పత్రాలు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పడక గదిలో ఉన్నాయని గోవా మంత్రి ఫోన్‌లో మాట్లాడిన టేప్ ఉందని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై జైట్లీ మండిపడ్డారు. అందులో ఏమాత్రం నిజం లేదని, అది కల్పిత టేప్ అని పారికర్ ఇప్పటికే ఖండించారు.. అయినా రాహుల్ అసత్య ఆరోపణలు చేస్తూనే ఉన్నారు అని జైట్లీ పేర్కొన్నారు.