హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై కొత్త కుట్రకు మరోసారి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నుంచి ఓటర్లను దూరం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చుక్కల భూముల పేరుతో కుట్రకు తెరదీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చుక్కల భూముల రైతులను ప్రభుత్వంపై ఉసిగొల్పాలని కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చుక్కల భూములను ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులరైజ్ చేసిందన్నారు. ఆ ఫైల్‌ను కొంతమంది అధికారులు తొక్కిపెట్టారని హీరో శివాజీ వ్యాఖ్యానించారు.
చుక్కల భూములపై సమస్యలను సంక్రాంతిలోపు పరిష్కరించకుంటే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని నటుడు శివాజీ ప్రకటించారు. కొందరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే రాజీనామా చేసి ప్రతిపక్షంలో కూర్చోవాలని అన్నారు. ఇప్పటికే కొంద మంది సీనియర్ ఉద్యోగులు పదవులకు రాజీనామాలు చేసి వారికి నచ్చిన పార్టీల్లో చేరాలని సూచించారు.
చుక్కల భూములపై ముఖ్యమంత్రి సూచించినా అధికారుల్లో పట్టింపులేదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో మంత్రులను కూడా అధికారులు లెక్కచేయడం లేదని శివాజీ ఆరోపించారు. ఈ సమస్య విపక్షానికి ప్రజాసమస్యలు పట్టవని, వారికి కావాల్సింది సీఎం కుర్చీయేనని విమర్శించారు. చుక్కల భూముల సమస్య రాజకీయ ఎత్తుగడకు అవకాశంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతిలోగా సమస్యను పరిష్కరించకుంటే తాను నిరాహార దీక్ష చేస్తానని శివాజీ అన్నారు.