జిల్లాలోని అంగన్ వాడీ కేంద్రాలకు గుడ్లు సరిగా సరఫరా కావడం లేదు. జిల్లాలో 28 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 5,545 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 431 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో గర్భవతులు 34,953 మంది ఉండగా వారిలో 34,942 మంది, పాలిచ్చే తల్లులు 36,280 మంది ఉండగా వారిలో 36,131 మంది పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నారు. అలాగే 0–1 వయసున్న చిన్నారులు 35,742 మంది ఉండగా వారిలో 35,571 మంది, 1–3 వయసున్న చిన్నారులు 1,19,626 మంది ఉండగా మొత్తం అందరూ, 3–6 చిన్నారులు 1,20,925 మంది ఉండగా వారిలో 83,277 మంది పౌష్టికాహారం తీసుకుంటున్నారు. వీరందరికీ ప్రతి రోజూ ఉడికించిన కోడిగుడ్డు సరఫరా చేస్తున్నారు.
కోడిగుడ్లు సరఫరా చేస్తున్న రైతులకు గత కొన్ని నెలలుగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.93 కోట్లు ఉండగా, జిల్లాలో రూ.13 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతంలో సంస్థకు ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 40–50 గ్రాముల కోడిగుడ్డు ఒక్కింటికి రూ.4.68 పైసల వంతున చెల్లిస్తున్నారు. నెలకు 75 లక్షల కోడిగుడ్లను కోళ్ల రైతులు అనపర్తి ప్రాంతీయ కోళ్ల రైతుల సంక్షేమ సంఘం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే 40 శాతం వరకు పెరిగిన దాణా ధరల నేపథ్యంలో గుడ్డు ధరను పెంచాలని సరఫరాదారులు డిమాండ్ చేస్తున్నారు. పాత టెండర్ ముగియడంతో ఇటీవల కోడిగుడ్ల సరఫరాకు కొత్తగా టెండర్లు పిలిచారు. 45–55 గ్రాముల బరువున్న కోడిగుడ్డు రూ.5.16 పైసలకు సరఫరా చేసేందుకు గతంలో సరఫరా చేసిన సంస్థే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి ఆమోద ముద్ర పడక పోవడంతో పాటు పాత బకాయిలు చెల్లించక పోవడంతో గుడ్ల సరఫరాను పది రోజులుగా నిలిపి వేసినట్లు సరఫరాదారులు చెబుతున్నారు. పది రోజుల క్రితం సరఫరా చేసిన కోడిగుడ్లు కొన్ని రోజులు వచ్చినా ఇప్పుడు సరఫరా నిలిపి వేయడంతో లబ్ధిదారులకు పౌష్టికాహారం కరువైంది.
జన్మభూమి గ్రామసభల్లో కోడిగుడ్లు సరఫరా కాకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు ఎదురైతే ఏమి సమాధానం చెప్పాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు, సూపర్‌వైజర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే జన్మభూమి ప్రారంభమయ్యేలోగా సమస్య పరిష్కారమవుతుందన్న ఆశాభావంతో ఉన్నారు.