YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయనగరం వైసీపీలో రగడ..రగడ

విజయనగరం వైసీపీలో రగడ..రగడ
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో అంతర్గతంగా ఉన్న విభేదాలు బయట పడుతున్నాయా? నాయకత్వ మార్పును కోరుకుంటున్నాయా? ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఇన్నాళ్లూ జిల్లా కేంద్రానికే పరిమితమైందన్న అసమ్మతి ఇపుడు నియోజకవర్గాలకూ విస్తరిస్తోంది. పార్టీలో సీనియర్‌ నాయకుడిగా.. వైసీపీని బలోపేతం చేసిన వ్యక్తిగా పేరున్న సాంబశివరాజును నెల్లిమర్ల నియోజకవర్గ కన్వీనర్‌ పదవి నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఆ నియోజకవర్గంలోని పాత బృందమంతా ఏకమయ్యేందుకు మంతనాలు సాగిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ సీనియర్‌ నాయకుడు పెనుమత్స సాంబశివరాజును నెల్లిమర్ల నియోజకవర్గ కన్వీనర్‌ పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. ఆ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయడుకు అప్పగిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మంగళవారం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.జిల్లా వైసీపీలో ఓ కుదుపు వచ్చినట్లు అయింది. వైసీపీలో ఎప్పటికప్పుడు కన్వీనర్ల మార్పు కారణంగా పార్టీలో పెద్ద దుమారమే రేగుతోంది. ఇన్నాళ్లూ పార్టీకోసం కష్టపడి నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి చివరి దశలో కన్వీనర్‌ను మార్చేస్తున్న కారణంగా జిల్లా వైసీపీ నాయకుల్లో అసంతృప్తి రేగింది. నిరాశలో ఉన్న నాయకులంతా ఏక తాటిపైకి వచ్చి తమ సత్తా ఏమిటో తెలియ జేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న సాంబశివరాజు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఐదేళ్ల పాటు పనిచేశారు. అలాగే పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడిగానూ బాధ్యతలు చూశారు. అలాంటి నేతను నియోజవర్గానికి కన్వీనర్‌గా కూడా కాకుండా చేయడాన్ని మిగతావారు జీర్ణించుకోలేకోతున్నారు. ఈ నేపథ్యంలో వారంతా ఏకతాటిపైకి వచ్చి తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి పెద్ద దిక్కుగా ఉండటమే కాకుండా రాజు నాయకత్వంలోనే గత ఎన్నికల్లో బొబ్బిలి, సాలూరు, కురుపాం ఎమ్మెల్యే స్థానాలను గెలిపించారు. అయితే తన కుమారుడు పెనుమత్స సురేష్‌బాబును నెల్లిమర్లలో గెలిపించుకోలేక పోయారు. రెండేళ్ల కిందటి వరకు ఈ నియోజకవర్గంలో సురేష్‌బాబే వైసీపీ కన్వీనర్‌గా ఉండే వారు. సాంబశివరాజుకే నెల్లిమర్ల టిక్కెట్టు ఇవ్వాలని భావించి నియోజకవర్గ కన్వీనర్‌ బాధ్యతలను అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో నిధుల ఖర్చుకు తూగలేరని భావించి పెనుమత్సను పక్కన పెట్టినట్లు సమాచారం. ఏదైనాగాని ఈ నిర్ణయం సరికాదని అసమ్మతి నాయకులంతా సాంబశివరాజుకు సంఘీభావం తెలుపుతూ టచ్‌లో ఉన్నారని, భవిష్యత్‌ కార్యా చరణకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. నియోజకవర్గ కన్వీనర్లను మార్చటం జిల్లాలో ఇది నాల్గోసారి.

Related Posts