అనంతపురంలో అమ్యూనేషన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు స్టంప్ ష్యూలే కేసింగ్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ దేశ రక్షణ రంగాలకు అవసరమైన అత్యున్నత ప్రమాణాలతో అమ్యూనేషన్ ఉత్పత్తులను దేశీయంగా తయారుచేసి సరఫరా చేస్తుంది. తొలి రెండు దశల్లో 520 కోట్ల రూపాయలను, మూడో దశలో 500 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతుంది. 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది. ఈ సంస్థ ఉత్పత్తి ప్రారంభిస్తే దక్షిణ భారత్‌లో అమ్యూనేషన్ తయారుచేసే సంస్థ ఇదే మొదటిది కానుంది. ఈ సంస్థకు దేశంలో 11చోట్ల తయారీ యూనిట్లు ఉండగా, స్ప్రింగ్స్ తయారీలో దేశంలోనే నెంబర్-1 పేరు పొందింది. ఏరోస్పేస్, డిఫెన్సు రంగాల్లోకి కూడా అడుగుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీఈడీబీ జె కృష్ణకిషోర్, ఎస్‌ఎస్‌సి ఎండీ సతీష్ మచ్చాని ఒప్పందాలపై సంతకాలు చేశారు.ఇది ఇలా ఉంటే, పరిశ్రమలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి’పై రూపొందించిన శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు. సేవలు, పారిశ్రామికం, పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. చాలా మంది పోటీపడినా.. మనపై ఉన్న విశ్వసనీయత కారణంగానే కియా మోటార్స్, ఇసుజు, జియో, అశోక్‌లేలాండ్, అపోలో టైర్స్ తదితర సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు. వెనకబడిన రాష్ట్రాలకు ఇచ్చే రాయితీలు మనకూ ఇచ్చి ఉంటే మరింత మంది పారిశ్రామికవేత్తలు వచ్చేవారని వివరించారు. ‘నాలుగున్నరేళ్లు రాత్రింబవళ్లు పనిచేశాం. ప్రపంచమంతా తిరిగాం. అధికారులు నిరంతరం శ్రమించారు. వ్యక్తిగతంగా నాపై ఉన్న విశ్వసనీయత కూడా ఇందుకు ఉపయోగపడింది’ అని చంద్రబాబు చెప్పారు. నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నామని.. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో రూపాయి అవినీతి లేకుండా అన్ని అనుమతులు ఇప్పించే విధానం తెచ్చామని అన్నారు.12 పారిశ్రామిక విధానాలు ప్రవేశపెట్టామన్నారు. విశాఖ ఐటీ కారిడార్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని కేంద్రంపై సీఎం మండిపడ్డారు. దుగరాజపట్నం నౌకాశ్రయం, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవకు నిధులు మంజూరులోనూ కేంద్రం అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. పెట్రో కెమికల్ కారిడార్ విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తోందని.. దీన్ని తామే ఏర్పాటు చేయించబోతున్నట్లు వివరించారు. నిమ్జ్‌ల ప్రకటన తప్పితే కేంద్రం పైసా విదల్చలేదని ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రకాశం జిల్లా కనిగిరి నిమ్జ్ తామే చేపట్టి రామాయపట్నానికి అనుసంధానించబోతున్నట్లు వెల్లడించారు.