‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర పోషించారు. అయితే సినిమా విడుదలకు ముందే వివాదం నెలకొన్న విషయం విదితమే. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ‘యూట్యూబ్’లో మాయమైంది. ట్రైలర్ అందుబాటులో లేదన్న విషయంపై అనుపమ్ ఖేర్ ట్విట్టర్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.‘డియర్ యూట్యూబ్.. ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అని యూట్యూబ్‌లో టైప్ చేస్తుంటే వీడియో కన్పించడంలేదు. ఆ ట్రైలర్ మొన్నటివరకూ తొలి స్థానంలో ఉంది. ఇప్పుడు చూస్తే 50వ స్థానంలో కూడా లేదు. యూట్యూబ్‌లో అసలు కనిపించడమే లేదు. దీనిపై నాకు ఫ్యాన్స్ నుంచి మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీనిపై యూట్యూబ్ యాజమాన్యం హెల్ప్ చేయాలి’ అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా ట్రైలర్ లింక్‌ను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ సమయంలో సంజయ్ బారూ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. ఆయన రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ బయోగ్రఫీని విజయ్ రత్నాకర్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా అభ్యంతరాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని తమకు చూపించాకే రిలీజ్ చేయాలని డిమాండ్ చేసింది. అయితే మన్మోహన్ సింగ్ ఒప్పుకుంటేనే ప్రత్యేకంగా ఆ సినిమాను ప్రదర్శిస్తామంటూ అనుపమ్ ఖేర్ స్పష్టం చేశారు.