వై.ఎస్.జగన్ ఏం చేయబోతున్నారు? ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉంది. వారంలో తమ భవిష్యత్తు తేలిపోతుందా? వైసీపీలో ఇప్పుడు ఇదే టెన్షన్ కనపడుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చివరి దశకు చేరుకుంది. ఈ నెల 9 వ తేదీన ముగింపు సభ ఉండే అవకాశముంది. ఇప్పటికే ఇచ్ఛాపురంలో పైలాన్ ను రెడీ చేస్తున్నారు. అదే రోజు ముగింపు సభ ఉంటుంది. ఈ ముగింపు సభ వేదిక నుంచి జగన్ ఏం ప్రకటించనున్నారన్న ఉత్కంఠ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. ఇచ్ఛాపురంలో జరిగే ముగింపు సభ నుంచే జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇప్పటికే తాను ప్రకటించిన నవరత్నాలతో పాటుగా మరికొన్ని కీలకమైన హామీలను ఈ వేదిక నుంచి జగన్ ప్రకటించనున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ వంటివి ఇందులో కీలకాంశాలుగా ఉండ బోతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ తన పాదయాత్రలో పదమూడు జిల్లాలూ పర్యటించారు. ఏడాదిపైగానే పాదయాత్రలో ఉన్నారు. ప్రజలను, సమస్యలను దగ్గరగా పరిశీలించారు. ప్రజాసమస్యలను పరిష్కరించే దిశగా జగన్ హామీలు ఉండబోతున్నాయి. ఇది పక్కన పెడితే జగన్ సభా వేదికపైనే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశముందన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. జగన్ జనవరి చివరి వారంలో గాని, ఫిబ్రవరిలోగాని అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని నిన్న మొన్నటి వరకూ అనుకున్నారు. కానీ తొలి జాబితాను ఇచ్ఛాపురం నుంచే ప్రకటించనున్నట్లు పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. మొత్తం 60 మంది అభ్యర్థుల జాబితాను ఇచ్ఛాపురం వేదికగా విడుదల చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇచ్ఛాపురంలో జరిగే ముగింపు సభకు జిల్లా,నియోజకవర్గ ఇన్ ఛార్జులను ఆహ్వానించారు. ఖచ్చితంగా రావాలంటూ ఆదేశాలు పంపారు. దీంతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జులు ఇచ్ఛాపురంచేరుకోనున్నారు. పెద్దగా పోటీలేని, ఖచ్చితంగా గెలవగలమని భావించే అరవై మంది అభ్యర్థుల జాబితాను ఇచ్ఛాపురంలో విడుదల చేస్తారని జగన్ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో తొలి జాబితాలో తమ పేరు ఉంటుందో? ఉండదో? నన్న టెన్షన్ ఫ్యాన్ పార్టీ నేతలకు పట్టుకుంది. వివాదం లేని నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశముందంటున్నారు. అభ్యర్థుల జాబితాను ప్రకటించాలా? లేక మ్యానిఫేస్టోను మాత్రమే విడుదల చేయాలా ? అన్న దానిపై జగన్ సీనియర్ నేతలతో చర్చించినట్లు సమాచారం. మొత్తం మీద టిక్కెట్ల టెన్షన్ వైసీపీలో 9 నుంచే ప్రారంభమవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.