ఇప్పుడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వంతు వచ్చింది. సినీ నటులకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. సినిమాల్లో వారు నటించే పాత్రల వల్ల కావొచ్చు, నటులకు ప్రజల్లో వచ్చే క్రేజ్ వల్ల కావొచ్చు తాము జనంలోకి దిగితే జేజేలు తప్పవన్న అంచనాల్లో వుంటారు స్టార్ డం వున్నవారు. అయితే ఇలా వెండితెరపై వెలిగి రియల్ లైఫ్ లోకి వచ్చి అదే జోష్ కొనసాగించిన వారు బహుతక్కువగానే వుంటున్నారు. రంగుల లోకంలో విహరించే వారు తమ కోటరీ పరిధి దాటిరాలేక సామాన్యుల గుండెచప్పుడు వినలేకపోవడంతోనే ఫాలోయింగ్ కి ఓట్ల కు తేడా వచ్చేస్తుంది.జస్ట్ ఆస్కింగ్ అంటూ మోడీ పై ఒంటికాలిపై గత కొంత కాలంగా లేస్తున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పొలిటికల్ ఎంట్రీ పై కొత్త ఏడాది నిర్ణయం తీసుకుని సంచలనం సృష్ట్టించాడు. అయితే కర్ణాటకలో జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య తరువాత ఆ సంఘటన కు వ్యతిరేకంగా తన గొంతు విప్పిన ప్రకాష్ రాజ్ ఒక పక్క మీడియా లో మోడీ సర్కార్ వైఖరిని వీలున్నప్పుడల్లా ఎండగడుతూ ప్రశ్నలు సంధించడం మొదలు పెట్టారు. మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ కి సపోర్ట్ గా జేడీఎస్ నేతలు దేవెగౌడ, కుమార స్వామి లతో కెసిఆర్ జరిపిన చర్చల్లో కీ రోల్ పోషించారు. ఆ తరువాత కూడా ఆయన అనేక వేదికలపై తనదైన శైలిలో మోడీ సర్కార్ పై విరుచుపడుతూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే అంతా అనుకున్నారు. అనుకున్నట్లే ఆయన కొత్త ఏడాది తన నిర్ణయం తీసుకున్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా ప్రకాష్ రాజ్ పార్లమెంట్ స్థానానికి పోటీకి సిద్ధమౌతున్నారు. అయితే ఆయన ఎక్కడినుంచి పోటీ చేసేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.పార్టీ ప్రారంభించి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా 9 నెలల్లోనే చరిత్ర సృస్టించిన ఎన్టీఆర్ కూడా చిత్తరంజన్ దాస్ చేతిలో 1989 ఎన్నికల్లో కల్వకుర్తిలో ఓటమి పాలయ్యారు. ఎన్టీఆర్ లా ప్రభంజనం సృష్టించాలని కలలు కని తొలి ఎన్నికల్లో తన సొంత అడ్డా పాలకొల్లు లో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బంగారు ఉషారాణి చేతిలో ఘోరపరాభవం పొంది చావుతప్పి కన్నులొట్టపోయినట్లు తిరుపతి లో గెలిచి పరువు దక్కించుకున్నారు. ఇక పిఆర్పీ ఒక్క పార్లమెంట్ సీటు సాధించలేకపోయింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ, కోటశ్రీనివాస్, బాబు మోహన్, జమున, జయప్రద, కృష్ణం రాజు, మోహన్ బాబు, తాజాగా మురళీమోహన్, బాలకృష్ణ, రోజా వంటివారంతా రాజకీయాల్లో రాణించగలిగారు. అయితే వీరికి ప్రజల్లో సొంత బలం ఏమీ ఎప్పుడూ లేదు. పార్టీ గాలివుంటే గెలవడం లేకపోతే మిగిలిన నాయకులతో బాటు ఓడిపోవడం రివాజుగా వస్తుంది. రాజకీయాలపై ఆసక్తి ఆలోచనలు ఉన్న పోసాని కృష్ణ మురళి 2009 లో పీఆర్పీ టికెట్ దక్కించుకుని చిలకలూరిపేట లో పోటీ చేసి చేదు అనుభవాలని చవిచూశారు.దక్షిణాదిలో ప్రకాష్ రాజ్ కి రెండు తెలుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, కేరళలో సైతం మంచి గుర్తింపు వుంది. అయితే వీటిలో ఎక్కడినుంచి ఆయన రంగంలోకి దూకుతారా అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండల్ కొండారెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అలా తీసుకోవడమే కాదు ఆ గ్రామ అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తూ వస్తున్నారు. దాంతో ఆయన ఆ ప్రాంతం నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరో పక్క తన మాతృ రాష్ట్రం కర్ణాటక నుంచే బరిలోకి దిగుతారని టాలీవుడ్ లో టాక్ వినవస్తుంది. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో 15 సీట్లతో పోటీ కి దిగి ఏమి సాధిస్తారంటూ ప్రశ్నలు వేశారు ఆయన. జగన్ మోడీతో వెళుతున్నారని వారి పనితీరు చెబుతుందని అందువల్ల వైసిపి తనకు ఇష్టం లేదని, ఇక పవన్ రాజకీయాలు నచ్చలేదని నిర్మొహమాటంగా వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యారు. తెలంగాణాలో కెసిఆర్ తప్ప మరో ఆప్షన్ లేదని తేల్చారు. ఇక ప్రజాక్షేత్రంలో ఎన్నికలను ఎదుర్కోవడం అంటే అంత ఆషామాషీ కాదు. డబ్బు, మందు ఇతర ప్రలోభాలు తో పాటు గాలి ఉంటేనే గెలిచే పరిస్థితి నేటి రాజకీయం. మరి ఇలాంటి రాజకీయాల్లో ఏ పార్టీ అండా లేకుండా స్వతంత్రంగా ఓట్ల యుద్ధానికి దిగుతా అంటున్నారు ప్రకాష్ రాజ్. మరి ఆయన ఆదర్శాలకు ఏ మాత్రం ఓటర్లు టర్న్ అవుతారు అన్నది చూడాలి.