మరో ప్రధాన పోరుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందన్న వార్తల నేపథ్యంలో ఆయా పార్టీల్లో అప్పుడే ఎంపీ ఎన్నికల ముచ్చట్లు మొదలయ్యాయి. జిల్లాలోని నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో వచ్చిన విధంగా ఏకపక్షంగా పార్లమెంటు ఎన్నికల తీర్పు ఉండదన్న అంచనాతో ఉన్నారు. శాసనసభకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ నాలుగు చోట్ల పరాజయం పాలైంది.రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరగకుండా ఒకవేళ జమిలి ఎన్నికల జరిగి ఉంటే నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించానని, అసెం బ్లీకి ముందుగానే ఎన్నికలు జరగడంతో అనివార్యంగా పోటీ చేయాల్సి వచ్చిందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారు. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే కోమటిరెడ్డి ప్రకటించారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. మరో రెండు, మూడు నెలల్లోనే లోక్‌సభకు జరగనున్న ఎన్నికల్లో ఆయన నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారుప్రధానంగా నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ కేవలం హుజూర్‌నగర్ స్థానంలో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన నల్లగొండ, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, కోదా డ, సూర్యాపేట .. ఇలా ఆరు చోట్లా టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. పార్లమెంటు ఎన్నికల్లో ఇది తమ కు లాభిస్తుందన్న అంచనాలో అధికార టీఆర్‌ఎస్ ఉండగా, శాసనసభ ఫలితాలు పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఫలించవని, కచ్చితంగా భిన్నమైన తీర్పే వస్తుందన్న భావనలో కాంగ్రెస్ ఉంది. ఈ అంశాల నేపథ్యంలోనే.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుంచి టికెట్లు ఆశిస్తున్న వారు తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. మరో వైపు ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. దీంతో సహజంగానే టీఆర్‌ఎస్ శ్రేణులు ఈ ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇటీవలే ముగిసిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో కూడా నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తారన్న మొదట్లో కొంత ప్రచారం జరిగినా, సెప్టెంబరు 6వ తేదీన అభ్యర్థులను ప్రకటించడంతో ఆ ప్రచారానికి తెరపడింది. పార్లమెంటు ఎన్నికలు అనగానే మరోమారు సీఎం కేసీఆర్ నల్లగొండనుంచే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రైతు సమన్వయ సమితి అ«ధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను శాసన మండలికి తీసుకుని కేబినెట్‌లో అవకాశం కల్పిస్తారని టీఆర్‌ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన ఈసారి లోక్‌సభకు పోటీ చేయపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఇప్పుడు పార్లమెంటుకు జరగాల్సిన ఎన్నికల్లోనూ నల్లగొండనుంచి రాజేశ్వర్ రెడ్డి పేరు అక్కడక్కడా వినిపిస్తున్నా.. ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి పేరు ప్రముఖంగా చెబుతున్నారు. గతంలో పార్టీ కోసం .. గెలిచే అవకాశం లేకున్నా, నల్లగొండ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి మండలికి పోటీ చేయడంతోపాటు, పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న ఆయనకు అధినేత కేసీఆర్ దగ్గర గుర్తింపు ఉంది. సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు లేవనుకుంటున్న నేపథ్యంలో, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌గా ఉండడం, సీఎం కేసీఆర్ నిజంగానే ఇక్కడినుంచి పోటీ చేస్తారా అన్న అంశంలో స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో బండా నరేందర్‌రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు.నల్లగొండ లోక్‌సభా నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తనకు ఉన్న పరిచయాలు, సీనియర్ నేతలు జానారెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి, టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సహకారంతో ఎంపీగా విజయం సాధిస్తానని కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికలపై దృష్టి పెట్టి ఆ మేరకు పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తన దగ్గరి వారికి సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు. మొత్తంగా ఆటు టీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీల్లో పార్లమెంటు ఎన్నికల ముచ్చట్లు జోరుగా సాగుతున్నాయి.