పోలవరం ఇరిగేషన్ జాతీయ ప్రాజెక్టు గురించి ప్రధాని మోడి బాధ్యాతారాహిత్యంగా మాట్లాడారు. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థ ప్రణాళిక, పర్వవేక్షణ, ఆచరణ అంశాలపై సర్వే చేసింది. దేశంలో 16జాతీయ ప్రాజెక్టు లలో పోలవరం పనులు వేగంగా , ప్రణాళిక బద్దంగా ఉందని అవార్డు ప్రకటించిందని మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ అవార్డు ను మనకు అందచేయనున్నారు. చంద్రబాబు ప్రజలు, రైతుల సంక్షేమం కోసం పోలవరం పూర్తి చేయాలని మమ్మలను పరుగులు పెట్టిస్తున్నారు. పోలవరం కాపర్ డ్యాం పనులు కూడా వేగంగా పూర్తి చేసి గిన్నీస్ రికార్డు సృష్టించాం 2019జులై కల్లా గ్రావిటీ తో నీరు తెచ్చే లా ఎపి ప్రభుత్వం పని చేస్తుందని కేంద్ర మంత్రి స్వయంగా ప్రకటించారు. రెండు సార్లు గడ్కరీ పోలవరం సందర్శించి అధికారులు, ప్రభుత్వాన్ని అభినందించారని అన్నారు. 11లక్షల 15 వేల క్యూబిక్ మీటర్లకు గానూ.. 9కోట్ల 33లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి అయ్యాయి. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా, నిబంధనల పేరుతో ఆపేసినా.. చంద్రబాబు రాజీపడకుండా పనులను వేగవంతం చేశారు. కేంద్రం ఆధీనంలోని అధికారులు పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. దేశం మొత్తం పోలవరం పనుల గురించి గొప్పగా చెప్పుకుంటుంటే.. ప్రధాని మోడి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నాయని అయన అన్నారు. మోడి డర్టీ పాలిటిక్స్ చేస్తూ బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు. తెలుగు ప్రజల పై కక్ష గట్టి ఎపి కి ద్రోహం చేస్తుంటే, జగన్ వారితో కలిసి తందానా అంటున్నాడు. పోలవరం అడ్డుకునేందుకు ముగ్గురు మోడి లు విషం చిమ్ముతున్నారు. దేశంలో ఆ మోడి విమర్శలు చేస్తుంటే, ఎపి లో ప్రతిపక్ష నేత జగన్ పునాదులే లేవలేదని చూడకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. తెలంగాణా సిఎం కేసిఆర్ తన కుటుంబ సభ్యులు తో కోర్టులో కేసులు వేయించి, అనుకూలమంటూ కబుర్లు చెబుతున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రమే అన్ని ప్రతికూల అంశాలకు పరిష్కారం చూపి, ప్రాజెక్టు పూర్తి చేయాలి. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ 2015లో పోలవరం వచ్చి పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. మోడి చేయాల్సిన పనులు చేయకుండా కాగ్ పేరు చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. మోడి ముఖ్య మంత్రిగా ఉండగా సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కూడా కట్టలేకపోయారు. ప్రధాని అయ్యాక అక్కడి ప్రాజెక్టు లకు నిధులు కేటాయించారు. గుజరాత్ కు ఒక న్యాయం, ఎపికి మరొక న్యాయం అన్నట్లుగా మోడి తీరు ఉందని అన్నారు. తెలుగు ప్రజల జీవనాడి అయిన పోలవరం సందర్శించకుండా విమర్శలు చేయడం జాతి ద్రోహం. నాడు చంద్రబాబు నాకు ఆదర్శమన్న మోడి.. ప్రధాని అయ్యాక ఇప్పుడు నీచంగా, దుర్మార్గంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా పూర్తి వాస్తవాలు తెలుసుకుని పోలవరం పూర్తి కి నిధులు విడుదల చేయాలి. చంద్రబాబుకు పేరు వస్తుందనే అక్కసుతో మోడి ఎపికి నిధులు నిలుపుదల చేస్తున్నారని ఆరోపించారు. ముగ్గురు మోడీలు కలిసి చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనించి తగిన బుద్ది చెబుతారని అయన వ్యాఖ్యానించారు.