విభజన హామీలు నెరవేర్చి, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ లోక్‌సభలో ఆందోళనకు దిగిన 12 మంది తెదేపా సభ్యులను స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ వారిపై వేటు వేశారు. ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, తోట నరసింహం, మురళీమోహన్, బుట్టారేణుక, అవంతి శ్రీనివాస్, మాగంటి బాబు, జేసీ దివాకర్‌రెడ్డి, శ్రీరాం మాల్యాద్రి, అశోక్ గజపతిరాజు, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణలను నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.కాగారాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆందోళన చేస్తున్న తమను సభ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని తెదేపా సభ్యులు మండిపడ్డారు. సస్పెన్షన్ వేటు పడినా స్పీకర్ పోడియం వద్దే ఎంపీలు నిరసన తెలిపారు. సభను వాయిదా వేసినా బయటకు వెళ్లకుండా లోపలే బైఠాయించారు. ఏపీకి న్యాయం చేసే విషయంపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని, అప్పటి వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని ఎంపీలు తేల్చి చెప్పారు.