ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ టోర్నీగా గుర్తింపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్ విదేశాల్లో జరిగే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ జరిగే సమయంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్‌ని విదేశాల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ రెండుసార్లు ఇలానే ఎన్నికల సమయంలో ఈ టోర్నీని తరలించారు. 2009లో దక్షిణాఫ్రికా గడ్డపై, 2014లో కొన్ని మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించారు. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి జూలై 14 వరకూ వన్డే ప్రపంచకప్ జరగనుంది. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సుల మేరకు ఆ మెగా టోర్నీకి 15 రోజులు ముందే ఐపీఎల్ 2019 సీజన్ ముగియడం తప్పనిసరి. అంటే.. ఏప్రిల్ మొదటి వారంలో ఐపీఎల్ మొదలై.. మే మూడో వారంలోపు ముగియాలి. కానీ.. ఇప్పటి వరకూ వెలువడిన వార్తల ప్రకారం.. మే చివరి వారం వరకూ ఐపీఎల్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్‌లు జరిగే సమయంలోనే ఎన్నికలు కూడా జరగనుండటంతో.. భద్రతా ఏర్పాట్లు చేయలేమని ఇప్పటికే నిర్వాహకులకి అధికారులు తేల్చి చెప్పేశారు. కానీ.. టోర్నీలోని 8 ఫ్రాంఛైజీలు.. భారత్ వెలుపల మ్యాచ్‌లు నిర్వహిస్తే..? భారీగా ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని ఆ నిర్ణయంపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. ఒకవైపు ఫ్రాంఛైజీల అభ్యర్థనని పరిగణలోకి తీసుకున్నట్లు కనిపిస్తున్న బీసీసీఐ అధికారులు.. మరోవైపు కేంద్ర హోం మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రితో.. విదేశాల్లో టోర్నీ నిర్వహణపై సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.