Highlights
- 64 ఏళ్లు పూర్తి చేసుకున్న సీఎం
- ధూంధాంగా వేడుకలకు గులాబీ శ్రేణుల ఏర్పాట్లు
- ఆస్ట్రేలియా, బహ్రెయిన్‌లలోనూ కార్యక్రమాలు
తెలంగాణ బలం, బలహీనతలను గుర్తెరిగిన ప్రజా నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం 64వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు.కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో దేవాలయాల్లో పూజలు, రెండుపడకగదుల ఇళ్లకు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, మెగా సర్వేక్షణ నిర్వహణకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన ఉత్సవాలు జరిగాయి.
హైదరాబాద్‌లోని జలవిహార్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో శనివారం జరిగే ఉత్సవాలకు కవిత ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఓయూలో ఎస్సీఎస్టీ కమిషన్ అధ్యక్షుడు ఎర్రోళ్లశ్రీనివాస్, టీఎస్‌టీఎస్ ఛైర్మన్ రాకేశ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆధ్వర్యంలో రక్తదానం, నేత్ర వైద్య చికిత్సల శిబిరాన్ని నిర్వహించనున్నారు.కేసీఆర్ జన్మదినం సందర్భంగా అయన పై రూపొందించిన గీతాన్ని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు.
కేసీఆర్ ప్రస్థానం..
2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించడంతో కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎన్నకయ్యారు. నాటి పరిణామాలతో.. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో కీలకమైన మలుపు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా తానే ఉండాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చేందుకు ఇది దోహదపడింది. తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా.. టీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో భారీ ఆధిక్యం రాలేదు. దీంతో ఆయన పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో దేశంలో ఇంతవరకు ఏపార్టీ చేయనివిధంగా వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును పార్టీయే భరిస్తుందని చెప్పడం ద్వారా ఆయన మంచి సంప్రదాయానికి తెరలేపినట్లు భావిస్తున్నారు.
రాజకీయ ఎత్తుగడల విషయంలో శత్రువులు కూడా ఆయనను మెచ్చుకోకుండా ఉండలేరు. ఎవరూ ఊహించని రీతిలో ఎత్తుగడలు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ను ఢీకొనేందుకు విపక్షాలు ఏకం అయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యేక విభజన ప్రకటనే ఇందుకు తార్కాణంగా పేర్కొనవచ్చు.