ఒకవైపు భారతీయ జనతా పార్టీపై వ్యతిరేకత.. మరోవైపు ఫ్రంటుల గోలతో జాతీయ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లోనూ పెను మార్పులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు వేరే వేరుగా ఫ్రంటులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తుండడంతో ఆ ప్రభావం జాతీయ పార్టీలపైనా పడుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీయేతర కూటమి ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే జట్టు కట్టారు. అలాగే పలు పార్టీలకు చెందిన నేతలతోనూ భేటీ అయ్యారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం.. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇవి చాలవన్నట్లు కేంద్రంలోని కొందరు సీనియర్ నేతలు ప్రధాని రేసులో తామే ఉన్నామని చెబుతున్నారు. గత ఏడాది జరిగిన కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారం సమయంలో అన్ని పార్టీలు ఏకతాటి పైకి వచ్చాయి. 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికల వరకు ఇదే కొనసాగుతుందని, దీని వల్ల బీజేపీ ఓటమి ఖాయమనే టాక్ వినిపించింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.చంద్రబాబు ఏర్పాటు చేయబోతున్న ఫ్రంట్‌కే తన మద్దతు ఉంటుందని ప్రకటించారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత మమతా బెనర్జీ. కానీ, మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ప్రచారం జరిగింది. కొద్దిరోజుల క్రితం తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత స్టాలిన్.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే తదుపరి ప్రధాని అంటూ చేసిన ప్రకటనపై టీఎంసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అప్పటి నుంచి ఆమె ముభావంగా ఉంటున్నారు. తాజాగా ఆ పార్టీ స్థాపించి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఈ వీడియో సందేశమిచ్చారు. అందులో 2019 సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తమ ప్రధాని అభ్యర్థిగా మమత పేరును దాదాపుగా ప్రకటించారు. లౌకిక, ప్రగతిశీల భారతావని నిర్మాణం కోసం ఆమె సారథ్యంలో కలసి పనిచేద్దామని ఆయన ఆ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఈ పరిణామంతో రాహుల్ గాంధీకి గట్టి షాక్ తగిలినట్లైంది. ప్రధాని కావాలని కలలు కంటున్న ఆయనకు మమత రూపంలో అడ్డంకి ఏర్పడినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆమె ఇంకెన్ని షాక్‌లు ఇస్తారో చూడాలి.