2014 ఎన్నికలకు ఇప్పటి పరిస్థితులకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అప్పుడు దేశ వ్యాప్తంగా మోదీ పేరు మారుమ్రోగిపోయింది. ఆయన వస్తాడు.. ఏదో చేస్తాడని ప్రజలంతా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. ముఖ్యంగా విదేశాల్లో దాచుకున్న నల్ల ధనాన్ని వెనక్కి తీసుకొస్తామంటూ మోదీ చేసిన ప్రకటన అప్పట్లో సంచలనం అయింది. దీంతో మోదీకి మంచి హైప్ క్రియేట్ అయింది. ఆ మేనియానే గత ఎన్నికల్లో ఎన్డీయేను విజయతీరాలకు చేర్చింది. అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు బాగా మారిపోయాయి. ఎన్డీయే వచ్చిన తర్వాత రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త రూ. 500, రూ. 2000 నోట్లను వాడుకలోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ పరిణామంతో నల్ల ధనం వెనక్కి రావడమేమే కానీ, ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏటీఎమ్‌ల చుట్టూ తిరుగుతూ ఎన్నో కష్టాలను అనుభవించారు. అంతేకాదు, ఇదే ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ పైనా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వీటితో పాటు, పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడమూ బీజేపీపై వ్యతిరేకతకు కారణం అయ్యాయి. దీనిపై దృష్టి సారించిన మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో భారతీయ జనతా పార్టీ దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే దేశ ప్రజలకు కొన్ని కానుకలు రెడీ చేశారని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న రైతుబంధు పథకాన్ని యథాతథంగా దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రకటన చేయబోతున్నారని తెలిసింది. ఈ పథకం కింద పంటకు ఎకరాకు 4000 రూపాయల చొప్పున ఏడాదికి 2 పంటలకు 8000 రూపాయల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో నేరుగా జమచేయాలని(డీబీటీ) కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, దీనికి తోడు లక్ష రూపాయల దాకా వడ్డీలేని పంటరుణాన్ని ఇవ్వాలని కూడా భావిస్తోందట. ప్రస్తుతం రైతులకు ఇస్తున్న వడ్డీతో కూడిన రుణాలను నిలిపివేసి, పూర్తిగా వడ్డీ లేకుండానే రుణాలు ఇవ్వబోతున్నారని వినికిడి. ఈ రెండు పథకాల సాధ్యాసాధ్యలపై ఇప్పటికే సమావేశం కూడా జరిగిందని టాక్. దేశవ్యాప్తంగా రైతుబంధు పథకం అమలుకు దాదాపు 2లక్షల కోట్ల రూపాయలు, వడ్డీలేని రుణాలకు దాదాపు 30వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆర్థిక నిపుణులు వెల్లడించారని సమాచారం. వీటికి సంబంధించిన ప్రకటనను ప్రధాని త్వరలోనే చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.