వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చిట్ట చివరి నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఏడాదికిపైగా 13 జిల్లాల్లో జరుగుతున్న ప్రజాసంకల్ప పాదయాత్ర చివరి దశకు చేరుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర ప్రవేశించింది. మరో ఆరు రోజుల పాటు ఈ నియోజకవర్గంలో జరగనుంది. ఈ నెల 9వ తేదీతో పాదయాత్ర ముగియనుంది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనూ ప్రజా సంకల్ప పాదయాత్రకు మంచి స్పందనే కన్పిస్తుంది. పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం నింపుతుంది.ఇచ్ఛాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి ఇచ్ఛాపురంలో తన సత్తా చూపుతోంది పసుపు పార్టీ. 1985 నుంచి 1999 వరకూ వరసుగా టీడీపీ ఇక్కడ నాలుగు ఎన్నికల్లో వరుస విజయాలను చవిచూసింది. 2004లో ఓటమి చవిచూసిన టీడీపీ తిరిగి 2009, 2014 ఎన్నికల్లో గెలిచి తన కోట చెక్కు చెదరలేదని నిరూపించుకుంది. టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఇక్కడ ఉంది. అభ్యర్థులను పార్టీ అధిష్టానం మారుస్తున్నప్పటికీ అభ్యర్థులను కాకుండా పార్టీకే ఇక్కడ ప్రజలు పట్టం కట్టడం విశేషం. ఒక్క ఎంవీ కృష్ణారావు మాత్రమే ఇక్కడ నాలుగుసార్లు గెలవడం విశేషం. అయితే అభ్యర్థులను మార్చడం ఇక్కడ టీడీపీకి సంప్రదాయంగా అచ్చివస్తుందనే చెప్పాలి.ఎంవీ కృష్ణారావు 1999లో టీడీపీ గుర్తుమీద గెలిచిన తర్వాత 2004 ఎన్నికల్లో ఆ టిక్కెట్ యాకంబరి దక్కత కు టీడీపీ కేటాయించింది. అప్పుడు ఓటమి పాలయింది. తిరిగి 2009లో పిరియా సాయిరాజ్ కు టిక్కెట్ కేటాయించింది. దీంతో అక్కడ టీడీపీ గెలిచింది. గత ఎన్నికల్లో మళ్లీ అభ్యర్థిని టీడీపీ మార్చడం విశేషం.గత ఎన్నికల్లో బెందాళం అశోక్ కు టీడీపీ టిక్కెట్ కేటాయించడంతో ఆయన విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి నర్తు రామరావు పై ఇరవై ఐదు వేల ఓట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. ఇక్కడ యాదవ, రెడ్డి, మత్స్య కార ఓట్లే ఎక్కువగా ఉండటంతో వారికి గేలం వేసే పనిలో ఉన్నాయి ప్రధాన పార్టీలు.ఇక్కడ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. 2009లో టీడీపీ గుర్తుపై గెలిచిన పిరియా సాయిరాజ్ తర్వాత వైసీపీలో చేరారు. ఈసారి ఖచ్చితంగా గెలుపుతనదేనన్న ధీమాగా వైసీపీ ఇక్కడ ఉంది. స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత తనకు కలసి వస్తుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. దీనికి తోడు నియోజకవర్గంలో ప్రజాసంకల్ప పాదయాత్ర జరగడం, ముగింపు సభ కూడా ఇక్కడే ఉండటంతో ఈసారి ఖచ్చితంగా గెలుపు తమదేనన్న విశ్వాసాన్ని వైసీపీ వ్యక్తం చేస్తోంది. మరి ఇచ్ఛాపురంలో జగన్ సభతోనైనా బోణీ కొడుతుందా? లేదా? అన్నది చూడాలి.