YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కూటమిలో కుంపట్లు

కూటమిలో కుంపట్లు
కాంగ్రెస్ కూటమిలో ఫైర్ బ్రాండ్స్ ఎన్నికలకు ముందే సంకేతాలు పంపుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. పదేళ్ల పాటు యూపీఏ ఛైర్ పర్సన్ గా ప్రభుత్వాన్ని ఒంటిచేత్తో నడిపిన సోనియాగాంధీ సయితం ఈ ఇద్దరి దెబ్బకు డంగై పోతున్నారు. వారే మమత బెనర్జీ, మాయావతి. వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థి ఎవరన్న చర్చ ఇప్పుడు కూటమిలో దాదాపుగా ప్రారంభమయిందనే చెప్పాలి. ఎన్నికల అనంతరం తేల్చాలని శరద్ పవార్ వంటి నేతలు అభిప్రాయపడుతున్నా ఆయన మాటలకు ఎవరూ విలువ ఇవ్వడం లేదు.డీఎంకే అధినేత స్టాలిన్ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ కూటమిగా చెప్పుకునే పార్టీల్లో ప్రధాని అభ్యర్థి పదవి చర్చనీయాంశమైంది.  రాహుల్ గాంధీ భావి ప్రధాని అని చేసిన ప్రకటన చిచ్చు రేపిందనే చెప్పాలి. మోదీకి దేశ వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలియడం, ఇటీవల మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలు కావడంతోప్రధాని పదవిపై ఆశలు పెంచుకున్నారు. అవకాశం వస్తే ప్రధాని పదవి ఎక్కడానికి తాము సిద్ధమేనన్న సంకేతాలను పంపుతున్నారు. అందులో మాయావతి, మమతబెనర్జీ ఒకరైతే మాజీ ప్రధాని దేవెగౌడ సయితం తనకు అవకాశం రాకపోతుందా? అని ఆశతో ఎదురుచూపులు చూస్తున్నారు.మాయావతి ఇప్పటికే కాంగ్రెస్ కు వార్నింగ్ ఇచ్చారు. భారత్ బంద్ సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలపై కేసులు ఎత్తివేయకుంటే అక్కడ మద్దతు ఉపసంహరణకు కూడా వెనకాడబోనని మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు హెచ్చరికలు పంపారు. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెంటనే కార్యాచరణకు దిగింది. కేసులన్నీ ఎత్తివేసింది. బహుజన్ సమాజ్ పార్టీ ఇది తమకు తొలి విజయంగా భావిస్తోంది. అఖిలేష్ అండతో తాను ప్రధాని పదవిని దక్కించుకోవచ్చని, అఖిలేష్ కు రాష్ట్రాన్ని వచ్చే ఎన్నికల నాటికి అప్పగించవచ్చన్నది మాయావతి ఆలోచన.ఇక మరో ఫైర్ బ్రాండ్ మమత బెనర్జీ కూడా తనంతట తాను బయట పడకపోయినా ఆ పార్టీ నేతల నుంచి అప్పుడప్పుడూ ప్రధాని పదవి పై వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఈ మేరకు మమత మేనల్లుడు, పార్లమెంటు సభ్యుడు అయిన అభిషేక్ బెనర్జీ విడుదల చేసిన వీడియో సంచలనమే రేపింది. వచ్చే ఎన్నికల్లో మమత బెనర్జీ ప్రధాని అభ్యర్థి అని ఆ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ కూటమికి ఇప్పటికే దూరంగా ఉన్న మమత బెనర్జీ కాంగ్రెస్ ను తన దారిలోకి రప్పించుకునేందుకు ఇతర ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడ గడుతున్నారు. మొత్తం మీద ఆ పదవిపై ఇప్పటికే కూటమిలో రచ్చ మొదలవ్వడం ఎటు దారికి తీస్తుందోనన్న ఆందోళన హస్తం పార్టీ నేతలను బాధిస్తుంది.

Related Posts