ప్రధాని మోదీ, కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి విమర్శల వర్షం కురిపించారు.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రఫేల్ ఒప్పందం వివాదంపై క్రిమినల్ దర్యాప్తునకు ఆదేశిస్తామని అన్నారు. శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘రఫేల్ ఒప్పందంలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌కే విదేశీ భాగస్వామ్యం ఇవ్వాలని భారత ప్రభుత్వం డసో ఏవియేషన్‌ను ఆదేశించినట్లు ఆ కంపెనీ అంతర్గత ఈ మెయిళ్ల ద్వారా బహిర్గతమైంది. అయినప్పటికీ ప్రభుత్వం దీనిపై మాట్లాడట్లేదు. రఫేల్ వివాదంపై కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడాలని కాంగ్రెస్ సహా మొత్తం ప్రతిపక్షం కోరుకుంటోంది’ అని రాహుల్ అన్నారు.మొన్నటి లోక్‌సభ సమావేశంలో అరుణ్‌జైట్లీ చాలా సేపు మాట్లాడారని, కానీ రఫేల్‌పై తాము వేసిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదని రాహుల్ ఎద్దేవా చేశారు. రఫేల్ చర్చకు భయపడి మోదీ దూరంగా వెళ్లిపోతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఈ వివాదంపై క్రిమినల్ దర్యాప్తునకు ఆదేశిస్తామని, నేరస్థులను శిక్షిస్తామని రాహుల్ స్పష్టం చేశారు.