పోలవరం మీద చంద్రబాబు జరగని విషయాలు చెబుతున్నారు. మేనాటికి పోలవరం నీరిస్తానని మళ్లీ ప్రకటించారు. మేలో గోదావరిలో నీరే ఉండదు. నీరున్నా ప్రాజెక్టు పూర్తికాదు. పూర్తయినా నీరివ్వటం సాధ్యం కాదు. శ్వేతపత్రం అనేది చర్చకోసం విడుదల చేస్తారు. తాము ఏమి చేశారో చెప్పుకోటానికి కాదు. కానీ చంద్రబాబు శ్వేత పత్రాల్లో కూడా వాస్తవాలు చెప్పటం లేదని నాకు అనిపిస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. శ్వేత పత్రాలమీద చర్చకు నేను సిద్ధం. ఎవరో ఒకరిని పంపండి. చివరకు ఆదరణ పథకంలో కూడా అవినీతి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అవినీతి అనేది పైనుంచి కిందకు పాకుతుంది. పైవాడు నీతిమంతుడైతే కిందవాళ్లు కూడా భయపడతారు. అవినీతి లేనిదే సర్కారు నడవని పరిస్థితి ప్రస్తుతం ఉంది. కాంగ్రెస్ హయాంలో అవినీతి ఉంటే చంద్రబాబు విపక్ష నేతగా ఫెయిలైనట్లు. ప్రస్తుతం వైకాపా ఫెయిలైందని అన్నారు. పవన్ కల్యాణ్ మీద చంద్రబాబు వ్యాఖ్యలు మైండ్ గేమ్ లో భాగం. పవన్ కల్యాణ్ కలిసిరావాలని కోరిన చంద్రబాబు ఈ మాట జగన్ ని ఎందుకు అడగలేదు. ఏపికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాంగ్రెస్ వచ్చినా రాదు. ఏపీ దేశంలోనే ముందుందని చంద్రబాబు చెబుతుంటే రాయితీలు, సహాయాలూ ఎందుకు చేస్తారు. చంద్రబాబు పది పార్లమెంటు స్థానాలు గెలిచి అవే అక్కడ మోడీకి కావాలంటే మళ్లీ కలిసిపోయినా ఆశ్చర్యం లేదు. టెక్నికల్ గా నేటికీ పార్లమెంట్లో రాష్ట్ర విభజన పూర్తికాలేదు. ఎవరన్నా నిలదీస్తే ఇది పెద్ద చర్చ అవుతుంది. సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉంది. కేంద్రం కౌంటర్ దాఖలు చేయలేదు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పదేపదే చెబుతున్నపుడు అసలు విభజనే సరికాదని ఎందుకు నిలదీయరని అన్నారు.