YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లోకసభలో రాఫెల్ ఫైర్

లోకసభలో రాఫెల్ ఫైర్
లోక్‌సభలో కాంగ్రెస్, బీజేపీ పక్షాల మధ్య రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై శుక్రవారం రోజు  సైతం వాడివేడిగా చర్చ జరిగింది. విపక్షాలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెబుతూ.. కాంగ్రెస్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. హెచ్ఏఎల్‌ను వదిలేసి అగస్టాతో ఎందుకు ఒప్పందం చేసుకున్నారని గత యూపీఏ ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. రాఫెల్ డీల్‌పై ఏ విషయం తెలియకుండా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆమె మండిపడ్డారు. హెచ్ఏఎల్‌కు యుద్ధ విమానాల డీల్ ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తారు కానీ, హెచ్ఏఎల్ సంస్థ గొప్పలతో పాటు లోపాలను రాహుల్ తెలుసుకోవాలన్నారు. తేజస్ విషయంలో హెచ్ఏఎల్ వేగంగా పనిచేయలేదని తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన యుద్ధవిమానాల తయారీసంస్థ డసో ఏవియేషన్, హెచ్ఏఎల్ మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని పేర్కొన్నారు. 
హెచ్ఏఎల్ ఓ ఏడాదిలో 8కి మంచి విమానాలను తయారుచేయలేదన్నారు. యూపీఏ హయాంలో హెచ్ఏఎల్‌ను పక్కనపెట్టి అగస్టాతో ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. యుద్ధ విమానాలపై అడిగితే మన వద్ద డబ్బులు ఎక్కడున్నాయని మీడియాను అప్పటి యూపీఏ రక్షణశాఖ మంత్రి ప్రశ్నించారని చర్చలో భాగంగా నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. పొరుగు దేశాలు చైనా, పాకిస్థాన్ వారి ఆయుధ సంపత్తిని రెట్టింపు చేసుకుంటూ పోతుంటే యూపీఏ పాలనలో భారత్ పురోగతి సాధించలేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం యుద్ధ విమానల సంఖ్యను తగ్గించలేదని, గత యూపీఏ ఒప్పందం చేసుకున్న 18 విమానాల నుంచి 36 యుద్ధ విమానాలు కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న ఘనత తమదే అన్నారు. 2001లో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే యుద్ధ విమానాలపై చర్చ వచ్చినా.. యూపీఏ హయాంలో విమానాలు ఎందుకు తీసుకురాలేక పోయారని ప్రశ్నించారు. 2016లో జరిగిన డీల్ ప్రకారం ఈ సెప్టెంబర్ నాటికి తొలి ఫైటర్ జెట్ రానుందని, 2022 నాటికి అన్ని యుద్ధ విమానాలు భారత్‌లో ఉంటాయని నిర్మలా సీతారామన్ వివరించారు. మరో వైపు  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాఫెల్ డీల్ పై క్రిమినల్ విచారణ జరిపిస్తామని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తెలిపారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. పార్లమెంటు ప్రాంగణంలో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ, మిలియన్ల డాలర్ల రాఫెల్ డీల్ పై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.పార్లమెంటులో రాఫెల్ పై జరిగిన చర్చలో పాల్గొనకుండా మోదీ పారిపోయారని రాహుల్ ఎద్దేవా చేశారు. అరుణ్ జైట్లీ చాంతాడంత ప్రసంగం ఇచ్చారని... ఈ సందర్భంగా తనపై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారని... తాను అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదని విమర్శించారు. ప్రధాని తరపున రక్షణ మంత్రి మాట్లాడుతున్నారని... తమ ప్రశ్నలకు వారైనా సమాధానం చెప్పాలని కాంగ్రెస్ తో పాటు విపక్షాలన్నీ కోరుతున్నాయని చెప్పారు.రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ ధరను రూ. 526 కోట్ల నుంచి రూ. 1600 కోట్లకు పెంచాలని ఎవరు నిర్ణయించారని ఈ సందర్భంగా రాహుల్ ప్రశ్నించారు. ధర పెరగడానికి ప్రధాని కారణమా? లేక రక్షణశాఖ కారణమా? అని అడిగారు. యుద్ధ విమానాల సంఖ్యను 36కు తగ్గించింది ఎవరని ప్రశ్నించారు. అనిల్ అంబానీకి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరని నిలదీశారు. కొత్త డీల్ కు సంబంధించి రక్షణశాఖ ఏవైనా అభ్యంతరాలు లేవనెత్తిందా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీపై అవినీతి కేసులతో పాటు... అంతర్జాతీయంగా అప్పులపాలైన అనిల్ అంబానీకి రాఫెల్ కాంట్రాక్ట్ ను అప్పగించి, దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టిన అంశంపై విచారణ జరిపించాలని అన్నారు.  

Related Posts