ఇండియన్ స్టాక్ మార్కెట్ రెండు రోజుల నష్టాలకు అడ్డుకట్ట వేస్తూ శుక్రవారం లాభాల్లో ముగిసింది. లాభనష్టాల మధ్య దోబూచులాడిన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు చివరకు లాభాల్లో క్లోజయ్యాయి. సెన్సెక్స్ 181 పాయింట్ల లాభంతో 35,695 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 10,727 వద్ద ముగిశాయి. బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ ఇండెక్స్‌లకు బలానిచ్చింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం, ఆసియా ప్రధాన మార్కెట్లు లాభపడటం, ముడి చమురు ధరల తగ్గుదల వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయి. మార్కెట్ చివరి గంటల్లో కొనుగోలు జోరందుకోవడం కూడా కలిసొచ్చింది. ఇకపోతే నిఫ్టీ50లో భారతీ ఇన్‌ఫ్రాటెల్ గరిష్టంగా 6 శాతానికి పైగా లాభపడింది. యస్ బ్యాంక్, వేదాంత, టాటా మోటార్స్ షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. భారతీ ఎయిర్‌టెల్ 2 శాతానికి పైగా ఎగసింది. అదే సమయంలో హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. సెక్టోరల్ ఇండెక్స్‌లలో ఒక్క ఐటీ మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1 శాతానికి పైగా నష్టపోయింది. ఇక పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ గరిష్టంగా 2 శాతానికి పైగా ర్యాలీ చేసింది