ఆర్టీసీ కార్మికుల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతామంటూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెన్స్ యాక్ట్(ఎస్మా)ను ప్రయోగించేందుకు ఆర్టీసి యాజమాన్యం సిద్ధమైంది. ఆర్టీసిలో సమ్మెలపై నిషేధం ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2018 నవంబర్ మూడో తేదీ నుంచి ఆరు నెలల పాటు సమ్మెలు నిషేధమని ఇచ్చిన ఉత్తర్వులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయని అందులో పేర్కొన్నారు. వేతన సవరణలో యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా గుర్తింపు సంఘంతో పాటు ఎస్‌డబ్ల్యూఎఫ్ ఇప్పటికే సమ్మె నోటీసును అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్మా ఉత్తర్వులు జారీ చేయడం ఉద్యమాన్ని అణచివేసే కుట్రలో భాగమేనని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. సమ్మె నిషేధ నోటీసులకు భయపడేది లేదని తేల్చి చెబుతున్నారు. ఆర్టీసిలో సమ్మె నోటీసు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమ్మె నిషేధం జిఒ ఇవ్వడం మామూలేనని, అందుకు భయపడేది లేదని ఆర్టీసి ఇయు రాష్ట్ర అధ్యక్షులు వైవి రావు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, ఎస్‌డబ్ల్యూఎఫ్ అధ్యక్షులు ఎస్‌కె జిలానీ బాషా, ప్రధాన కార్యదర్శి సిహెచ్ సుందరయ్య తెలిపారు.