ఇప్పటికే జాతీయ అవార్డు సహా పలు ఘనతలను సాధించిన పోలవరం జాతీయ ప్రాజెక్టు తాజాగా గిన్నీస్ బుక్‌లో చోటు కోసం సిద్ధమవుతోంది. 24 గంటల్లో 28 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేయడం ద్వారా రికార్డు సాధనకు కాంట్రాక్టు సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 6వ తేదీ ఉదయం 9గంటల నుంచి 7వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఈ మహాక్రతువు సాగనుంది. 24 గంటల్లో మొత్తం 28వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటును స్పిల్ వే, స్పిల్ ఛానల్‌లో వేయనున్నారు. ఇప్పటివరకు ఈస్థాయిలో కాంక్రీటు పని ఏ ప్రాజెక్టులో జరగని కారణంగా కాంట్రాక్టు సంస్థ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు సంస్థ ప్రతినిధులను ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి ఆహ్వానించింది. గిన్నిస్ బుక్ ప్రతినిధులు రెండు రోజుల ముందుగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుంటారు. కాగా 7వ తేదీ ఉదయం ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారు. 7వ తేదీ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుని, గిన్నీస్ బుక్‌లో నమోదు పత్రాన్ని ప్రతినిధుల నుండి అందుకోనున్నారు. ఈ సందర్భంగా 10వేల మంది రైతులతో సభ నిర్వహిస్తారు. అలాగే కాంక్రీటు రికార్డుకు సంబంధించి పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు.