YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

350 కోట్లు వెనక్కి తీసుకోవడంపై హైకోర్టు ప్రశ్న

 350 కోట్లు వెనక్కి తీసుకోవడంపై హైకోర్టు ప్రశ్న
ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇచ్చిన రూ.350 కోట్లను ఎందుకు వెనక్కి తీసుకోవలసి వచ్చిందని నవ్యాంధ్ర హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై ఈ నెల 24వ తేదీలోగా తగిన వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది ఒక్కో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున మూడేళ్లపాటు ఇచ్చిన కేంద్రం.. 2017-18 సంవత్సరానికి కేటాయించిన రూ.350 కోట్లను గతేడాది ఫిబ్రవరి 9వ తేదీన రాష్ట్రప్రభుత్వ ఖాతాలో జమ చేసి.. అదే నెల 15వ తేదీన వెనక్కి తీసేసుకుంది. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గత ఏడాది జూన్‌ 13వ తేదీన ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు.పిటిషన్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో.. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ముందు గురువారం విచారణకు వచ్చింది. కొణతాల తరఫున సీనియర్‌ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్‌ 46 (2) (3) ప్రకారం.. వెనుకబడిన ఏడు జిల్లాలకు కేటాయించిన నిధుల్ని ఇచ్చినట్లే ఇచ్చి.. కేవలం రాజకీయ కారణాల వల్ల వెనక్కి తీసుకుందని, దీనివల్ల ఆయా జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి కారణాలు చూపకుండా ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడంలోని అంతరార్థం తెలియడం లేదన్నారు. అందువల్ల ఆ నగదును తక్షణం రాష్ట్రానికి ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. ప్రజల కోసం పోరాడుతూ, కోర్టును ఆశ్రయించిన తమకు ప్రభుత్వం కూడా మద్దతివ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అందుకు పిటిషనర్‌ వాదనను తాము సమర్థిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం.. ఆ రూ.350 కోట్లను ఎందుకు వెనక్కి తీసుకున్నారో తెలియజేస్తూ, అందుకు కారణాలను వివరిస్తూ.. హైకోర్టు సెలవులు ముగిసిన అనంతరం 24వ తేదీకల్లా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. రెండు రోజుల క్రితం, మోడీ ఈ విషయం పై రాజకీయ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరి, ఇదే విషయం కోర్ట్ కి చెప్తారో, అసలు ఏమి చెప్తారో చూడాలి..

Related Posts