రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్ల బాధ్యత నుంచి సైతం ప్రభుత్వం తప్పించుకుంది. నాలుగు మాసాల నుంచి ఉల్లి పండించిన రైతులు ధర లేక నష్టాలపాలవుతుండగా మార్కెట్ సీజను చివరిలో జనవరిలో చంద్రబాబు ప్రభుత్వం స్పందించింది. మద్దతు ధరల పథకాన్ని (ప్రైస్ సపోర్టు స్కీం) ప్రకటించింది. ఉత్తర్వులు జారీ చేసింది. కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.700గా నిర్ణయించింది. ఉల్లి పంట ఆగస్టు నుంచి మార్కెట్‌కొస్తోంది. ధరలు బాగా పతనమయ్యాయి. ఒకానొక దశలో క్వింటాలు రూ.100-150కి పడిపోయింది. దీంతో కోత, రవాణ ఖర్చులు సైతం పడక రైతులు పంటను చేలల్లో వదిలేశారు. రోడ్లపై పారబోశారుఅంతకంటే రైతులు ఎంత తక్కువకు అమ్ముకుంటే ఆ వ్యత్యాసాన్ని రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తానంది. దీనికి పలు షరతులు విధించింది. కేవలం కర్నూలు మార్కెట్‌లో కొనుగోళ్లకే స్కీంను పరిమితం చేసింది. ఎకరాకు ఈ సంవత్సరం ఆరు టన్నుల దిగుబడొస్తుందని జీవోలో అంచనా వేసిన ప్రభుత్వం సీజను మొత్తమ్మీద కర్నూలు మార్కెట్‌కు 9 లక్షల క్వింటాళ్ల వరకు వస్తాయని పేర్కొంది. 2018 ఆగస్టు నుంచి 2019 ఫిబ్రవరి మధ్య జరిగిన కొనుగోళ్లకు పథకాన్ని అమలు చేస్తామంది. క్వింటా రూ.700 కంటే తక్కువకు మార్కెట్‌లో అమ్ముకున్న రైతులను ఉద్యానవన, రెవెన్యూ విభాగాల అధికారులు గుర్తిస్తారని తెలిపింది. కొసమెరుపేంటంటే.. ఈ పథకానికి రూ.4 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసి, అందులో రూ.రెండు కోట్లను సెంట్రల్ మార్కెట్ ఫండ్ నుంచి వాడుకోవాలని మార్కెటింగ్ కమిషనర్‌ను ఆదేశించింది. మిగతా రూ.రెండు కోట్లనూ రాష్ట్రం తర్వాత మంజూరు చేస్తా నంది. రైతులు ఉల్లిని పండించిన విస్తీర్ణం, ఉత్పత్తి ఎకరా నికి ఆరు నుంచి 8 టన్నులు ఈ నిబంధనల ప్రకారం లబ్ధిదారులను గుర్తించాలంది. రైతులు నాణ్యమైన ఉల్లిపాయలను మార్కెట్‌కు తీసుకు రావాలని పేర్కొంది.నెలల పర్యంతం స్పందించని సర్కారు ఇప్పుడు మద్దతు ధర స్కీం అంటూ జీవో తెచ్చింది. ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనలు రైతులకు చేయూత ఇచ్చేకంటే 'చెయ్యి' ఇచ్చేటట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ఉల్లికి పెద్ద మార్కెట్ తాడేపల్లిగూడెం కాగా కేవలం కర్నూలు మార్కెట్‌కే స్కీంను పరిమితం చేసింది. అలా చూసుకున్నా ఒక్క కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌లో 50 వేల ఎకరాల్లో ఉల్లిని సాగు చేశారు. సర్కారు అంచనా మేరకు ఎకరాకు 60 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుంటే ఆ జిల్లాలోనే సుమారు 30 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ప్రభుత్వం మాత్రం 9 లక్షల క్వింటాళ్లని లెక్కలేసి రైతులకు రూ.4 కోట్లు లబ్ధి చేకూరుస్తామంటోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 9 లక్షల క్వింటాళ్లను రూ.4 కోట్లతో భాగిస్తే క్వింటాకు రైతుకు సగటున చెల్లించేది రూ.45 మాత్రమే.ఇప్పటికే సీజను చివరిలో ఉన్నందున ఆ మేరకు కూడా రైతులకు లబ్ధి చేకూరే అవకాశం లేదు. మధ్య దళా రీలు, ట్రేడర్లకు లాభం చేకూర్చేందుకే ఆలస్యంగా మద్దతు ధర స్కీంను ప్రకటించినట్లు ఆరోపణలొస్తున్నాయి. ఉల్లి ధరలు పతనమైనప్పుడు సర్కారు మార్కెట్‌లో జోక్యం చేసు కొని నేరుగా రైతుల నుంచి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసి అనంతరం రైతు బజార్లలో చౌక ధరలపై వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంది. ఈ విధంగా అటు రైతులకు ఇటు వినియోగదారుల సంక్షేమానికి ప్రభు త్వం పని చేయాలి. సర్కారు రెండందాలా చేతులెత్తేసింది.