ఆంద్రప్రదేశ్ లో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మైండ్ గేమ్ మొదలయింది. ఒకరికి మరొకరు మిత్రులంటూ ప్రత్యర్థి పార్టీలపై బురద జల్లడం కామన్ అయిపోయింది. మైండ్ గేమ్ లు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని మించిన వారు మరొకరు ఉండరేమో. నిన్న మొన్నటి వరకూ పవన్, జగన్, మోదీలకు సంబంధాలను అంటగట్టిన చంద్రబాబు తెలంగాణ ఎన్నికలకు ముందు నుంచే కేసీఆర్ ను కూడా ఆ గాటన కట్టేశారు. తాజాగా చంద్రబాబు కొంత స్ట్రాటజీని మార్చి పవన్ ను పక్కన పెట్టారు. చంద్రబాబు ఇప్పుడు అన్ని రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మోదీయే తనను రక్షించాలని గట్టిగా నమ్ముతున్నారు.బీజేపీపై ఉన్న వ్యతిరేకత తనను గట్టెక్కిస్తుందని బాబు బలంగా విశ్వసిస్తున్నారు నిత్యం ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీపై విమర్శలు చేస్తూ ప్రజల్లో కొంత అనుకూలత సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల కంటే రానున్న ఎన్నికలు భిన్నమన్న సంగతి అందరికీ తెలిసిందే. బీజేపీ ఉన్న వ్యతిరేకతను పెంచి, కాంగ్రెస్ పై విభజన కోపాన్ని తగ్గించడమే ప్రస్తుతం చంద్రబాబు ముందున్న పని. అందుకే ధర్మపోరాటదీక్షలు గాని, జన్మభూమి -మాఊరు వంటి కార్యక్రమాలు గాని. ఏ కార్యక్రమాల్లోనైనా బీజేపీని నిందించడం, కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం కామన్ అయిపోయింది.విభజన హామీలు అమలు చేయని మోదీపై కొంత వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే. అందుకే అన్ని పార్టీలనూ మోదీజట్టులోకి పంపేందుకు చంద్రబాబు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. జగన్ కేసుల మాఫీ కోసమే మోదీతో జట్టుకట్టారంటున్నారు. జగన్ మాత్రం ప్రత్యేక హోదా ఇచ్చే ఏ పార్టీకైనా తన మద్దతు ఉంటుందని, అది ఎన్నికల తర్వాత మాత్రమేనని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని పదే పదే చెబుతున్నా చంద్రబాబు మాత్రం ఈ ప్రచారాన్ని కొనసాగించుకుంటూనే వెళుతున్నారు. పవన్ కల్యాణ్ ను పక్కనపెట్టి మోదీ, జగన్, కేసీఆర్ లను కలిపారు. పవన్ కల్యాణ్ తో కలసి వెళితేనే మంచిదన్నది బాబు ఆలోచన. గత ఎన్నికల్లో తమ పార్టీకి అండగా నిలిచిన కాపు సామాజిక వర్గం ఓట్లు చీలిపోతే జగన్ లబ్ది పొందుతాడన్నది బాబు భయం. అందుకోసమే ఆయన పవన్ తో జట్టు కట్టేందుకు రెడీ అయ్యారు. అందువల్లనే ఆయన పవన్ టీడీపీతో కలిస్తే తప్పేంటని ప్రశ్నించి పవన్ కు సానుకూల సంకేతాలు పంపారు. అయితే పవన్ ఊహించని విధంగా దీన్ని తిప్పికొట్టడంతో చంద్రబాబు కొంత అయోమయంలో పడ్డారు. ఎన్నికల నాటికి పవన్ ను మంచి చేసుకోవచ్చన్న బాబు ఆలోచనకు పవన్ కల్యాణ్ ఆదిలోనే గండి కొట్టడంతో చంద్రబాబు డీలా పడిపోయారు.