YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

2019 ఎన్నికలకు మో‘ఢీ‘

 2019 ఎన్నికలకు మో‘ఢీ‘

నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికల్లో తిరిగి విజయం సాధించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మోదీ ప్రచార పర్వాన్ని అప్పుడే ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా వంద ర్యాలీల్లో ఆయన పాల్గొనేలా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. అన్ని రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో ఈ ర్యాలీలు ఉండేలా బీజేపీ ప్లాన్ చేసింది. వంద ర్యాలీల్లో పాల్గొననున్న మోదీ ముఖ్యంగా ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను వివరించడంతోపాటుగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరగనుందన్న దానిపై గత చరిత్రను తిరగేయననున్నారు.రైతు రుణమాఫీ పట్ల మోదీ ఇష్టపూర్వకంగా లేరు. ఇప్పటికే కాంగ్రెస్ రైతు రుణమాఫీ నినాదాన్ని అందుకుంది. ఇటీవల గెలిచిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో రైతు రుణమాఫీని అమలు చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే రైతు రుణ మాఫీని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఇప్పటికే రాహుల్ ప్రకటించారు. దీంతో మోదీ రైతు రుణమాఫీ పట్ల సానుకూలంగా లేరు. ఇటీవల ఇంటర్వ్యూలో కూడా మోదీ అదే విషయాన్ని చెప్పారు. రైతు రుణ మాఫీ చేస్తే కాంగ్రెస్ డిమాండ్ కు తలవొగ్గినట్లవుతుందన్న కారణం ఒకటి కాగా, రైతుకు శాశ్వత ప్రయోజనాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో మోదీ ఉన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకాన్ని అమలు చేయాలన్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తే ఆ క్రెడిట్ తమకే దక్కుతుందన్న ఆలోచన లోఉన్నారు. తెలంగాణాలో ఇప్పటికే రైతు బంధు పథకం అమలవుతుంది. రెండు పంటలకు కలిపి కె.చంద్రశేఖర్ రావు ఎనిమిది వేలు ఇస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి దానిని పదివేలకు పెంచారు. కేవలం భూమి హక్కు దారులకే ఈ పథకం వర్తించనుంది.కేంద్ర ప్రభుత్వం ఎకరానికి నాలుగు వేలు ఒక పంటకు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అయితే ఇందులో కౌలు దారులను కూడా కలపాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు ఎకరానికి యాభైవేల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని ఇచ్చే ప్రతిపాదనను కూడా మోదీ సర్కార్ సీరియస్ గానే పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల సంవత్సరానికి దాదాపు రెండున్నర లక్షల కోట్ల భారం కేంద్ర సర్కార్ పై పడననుంది. దీనిపై ఆర్థిక శాఖ అధికారులతో ఇప్పటికే మోదీ చర్చించినట్లు చెబుతున్నారు. అంతా సక్రమంగా జరిగితే సంక్రాంతి కానుకగా మోదీ ఈ పథకాన్ని ప్రకటించే అవకాశమున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మొత్తం మీద ఎన్నికల నాటికి మోదీ తిరిగి తన ఇమేజ్ ను పెంచుకోవాలని చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు సఫలం అవుతుందో చూడాలి.

Related Posts