సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతో తనను చంపేందుకు టీడీపీ కార్యకర్తలు వచ్చారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. శనివారం ఉదయం తన ఇంటి ముందు జరిగిన టీడీపీ శ్రేణుల ధర్నాపై కన్నా మాట్లాడుతూ తన మీద హత్యాయత్నంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. గతంలో అమిత్షా, జగన్, పవన్పై ఇప్పుడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. గవర్నర్ దృష్టిసారించి రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. కాకినాడలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన కార్యకర్తల పట్ల సీఎం అమర్యాదగా ప్రవర్తించారన్నారు. మహిళా కార్పొరేటర్ను ఫినిష్ చేస్తామని సీఎం అనడం దారుణమన్నారు. సీఎం బెదిరింపులో భాగంగానే టీడీపీ గుండాలు నా ఇంటిపై దాడికి దిగారన్నారు.ఏపీలో ప్రజాస్వామ్యమే లేదని, వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించారని విమర్శించారు. చంద్రబాబు పోలీసులతో పాలన సాగిస్తున్నారని అయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతకుముందు కన్నా లక్ష్మీ నారాయణ ఇంటి ఎదుట టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. విజయవాడ టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కన్నా ఇంటి ముందు ధర్నాకు దిగారు. మోదీ, కన్నాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.