వైకాపా అధినేత జగన్ ఆదేశిస్తే చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు సిద్ధమని మాజీ ఎంపీ చిమటా సాంబు అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చీరాల నియోజకవర్గంలో అత్యధికంగా బీసీలు ఉన్నారనే ఆలోచనతో జగన్ యాదవ సామాజికవర్గానికి చెందిన వారికి సీటు కేటాయించే ఆలోచనలో ఉన్న తరుణంలో తాను సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మొదట్లో జగన్, పవన్లు ప్రత్యేకహోదా కోసం మాట్లాడుతుంటే.. ప్రత్యేక హోదా కన్నా, ప్రత్యేక ప్యాకేజి ముఖ్యమని చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు.
ఇప్పుడేమో ప్రత్యేకహోదా అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు కాంగ్రెస్కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇతర పక్షాలను కూడగట్టారన్నారు. 1989లో బోఫోర్స్ కుంభకోణం నేపథ్యంలో 105 మంది ఎంపీలను రాజీనామా చేయించి కాంగ్రెస్కు వణుకు పుట్టించారన్నారు. ఆ 105 మంది ఎంపీలలో తాను ఒకడినని గుర్తుచేశారు. అలాంటి నేపథ్యం ఉన్న టీడీపీని వ్యక్తిగత ప్రయోజనాల కోసం మరలా కాంగ్రెస్తో జతకట్టడం దారుణమన్నారు.