Highlights
- 11 రోజుల పాటు ఉత్సవాలు
- 24న తిరుకల్యాణోత్సవం
- సీఎం కేసీఆర్ దంపతులు రాక
తెలంగాణ రాష్ట్రం లోని అతిపవిత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోపేతంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం అంకురార్పణ పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఆదివారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు.
19న మత్స్యావతారం, అలంకారసేవ, శేషవాహనసేవ,
20న శ్రీకృష్ణాలంకారం, రాత్రి హంసవాహన సేవ,
21న వటపత్రసాయి అలంకారసేవ, రాత్రి పొన్నవాహనసేవ ఉంటాయి.
22న గోవర్థనగిరిధారి అలంకారసేవ, రాత్రి సింహవాహన సేవ,
23న జగన్మోహిని అలంకార సేవ, రాత్రి అశ్వవాహన సేవ (స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం),
24న హనుమంత వాహనం, రాత్రి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం,
25న శ్రీ మహావిష్ణువు అలంకారం, గరుడవాహన సేవ, స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం,
26న ఉదయం 11 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రస్నానం,
27న స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగారడోలోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి.
బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 24న జరిగే తిరుకల్యాణోత్సవం లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు దంపతులు పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి వారు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదే రోజు గవర్నర్ నరసింహన్ కూడా ఉత్సవాలకు హాజరవుతారు. ఇక ఆ రాత్రి కొండ కింద నిర్వహించే కల్యాణంలో ఉమ్మడి తెలుగు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొంటారు. ఈ సందర్భంగా భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.