ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకుల సమీక్షా సమావేశంలో పవన్కళ్యాణ్ మాట్లాడారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న సమయంలో నేను జనసేన పార్టీని స్థాపించాను. భావజాలం లేని పార్టీలు రాజ్యాలు ఏలుతున్న తరుణంలో కొత్త పార్టీ పెట్టడానికి సమయం ఆసన్నమైందని నాకు అనిపించింది. నేను సినిమాల్లోకి రాక ముందు నుంచి సమాజాన్ని క్షుణ్ణంగా అర్ధం చేసుకోవడం ప్రారంభించానని అన్నారు. కళాశాల నుంచి పట్టాలు తీసుకోకపోయినా, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ పాలసీలు, దేశంలో కులాలు వాటి ప్రభావం అంబేద్కరిజం వంటి వాటిని సంపూర్ణంగా అర్ధం చేసుకున్నాను. ఆ తర్వాతే పార్టీని ఏర్పాటు చేశాను. పీఆర్పీ ఆవిర్భావానికి బలమైన పాత్ర పోషించిన వారిలో నేను ఒకణ్ణి. ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి చిరంజీవి గారికి ప్రేరణ కలిగించిన వారిలో నేను కూడా ఒకడిని. ప్రజారాజ్యం వల్ల సామాజిక న్యాయం జరిగి ఉండేది. అయితే ఓపిక లేని నాయకులు పార్టీలో చేరినందు వల్ల ఆ అవకాశం చేజారిందని అన్నారు. అన్ని పార్టీలలోని నాయకులు రాజకీయాల్లో వారు పెట్టిన పెట్టుబడికి అనుగుణంగా మాట్లాడేవారేగానీ, ప్రజలకి అనుగుణంగా మాట్లాడేవారు కనుమరుగైపోతున్నారు. నేను పార్టీ పెట్టినప్పుడు పెద్ద నాయకులు ఎవరూ లేరు. యువతను నమ్మి నేను పార్టీ పెట్టాను. వారే నా వెన్నెముక. దీర్ఘకాలిక ప్రయోజనం కోసం మనం ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు సంపూర్ణంగా వ్యాపారం అయిపోయాయి. ప్రజల పెన్షన్లు, రేషన్ కార్డులు వంటి సమస్యలు పరిష్కరించే ఓపిక కూడా నేతల్లో కనిపించడం లేదు. రాజకీయాలు వ్యాపారంగా మారిపోతే సేవా భావం క్షీణించిపోతుంది. ప్రకృతి వైపరీత్యాలు కులాలు, మతాల్ని చూసి నష్టాన్ని కలిగించవు. అన్ని కులాల వారు ప్రకృతి దృష్టిలో సమానమే. అన్ని కులాలు ఐక్యంగా పనిచేసే సందర్బాలు ఉంటాయి. అటువంటిదే జనసేన అని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే 2 వేల కోట్లు అవసరం అని చాలా మంది నాతో అంటున్నారు. ఇప్పుడున్న రాజకీయ పక్షాలు అందుకు సన్నద్దంగా ఉన్నాయని చెబుతున్నారు. మరి ఆ పార్టీలతో నువ్వెలా పోటీ పడతావని ప్రశ్నిస్తున్నారు. నేను వారికి ఒకటే చెబుతున్నాను ఈ విషయంలో నాకు స్వర్గీయ కాన్షీరాం స్ఫూర్తి. రాజకీయాలు నడపడానికి డబ్బు అవసరం లేదని రుజువు చేసిన మహానేత ఆయన. కారు టైర్లను చెప్పులుగా మలచుకుని రాజకీయాల్లో తిరిగిన నేత ఆయన. రాజకీయాలు నడపడానికి డబ్బు అవసరం లేదని రుజువు చేసిన మార్గదర్శి కాన్షీరాం. ఆయనే నాకు ఎన్నికల్లో పోటీ చేయడానికి స్ఫూర్తి. పీఆర్పీ అనుభవాలు దృష్టిలో పెట్టుకుని నేను పార్టీ కమిటీల నియామకానికి తొందరపడలేదని అన్నారు. ఆనాడు పీఆర్పీలోకి వచ్చిన వారంతా పదవీ వ్యామోహంతో చిరంజీవి లాంటి ఒక బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చేశారు. అందువల్ల పార్టీ నిర్మాణంలో నేను ఆచితూచి ముందుకి వెళ్తున్నానని స్పష్టం చేసారు. రాత్రికి రాత్రి రాజకీయాల్లో ఎదగలేరు. కనీసం పాతిక సంవత్సరాలు ఓపిక పట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మన భారత రాజకీయాలలో మధ్యే మార్గం(మిడిల్ పాత్) అవసరం. అటువంటి మిడిల్ పాతే జనసేన పార్టీ. ప్రజలందర్నీ కలిపే విధంగా ఒక ఉమ్మడి సిద్ధాంతం అవసరం. అవే జనసేన ఏడు మూల సూత్రాలు. కొంత కాలానికి జనసేన పేరు చెబితే వెనక్కి వెళ్లి, జనసేన ఆశయాలు ముందుకి రావాలి. 2014 ఎన్నికలలో రాష్ట్ర సమగ్రత కోసం తెలుగుదేశాన్ని సపోర్టు చేస్తే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో సమతుల్యత కోసం అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాం. అవసరాలు ఎక్కడ ఉంటాయో, సమస్యలు ఎక్కడ ఉంటాయో ఆ ప్రాంతంలో మనం ప్రజలకి అండగా ఉంటే ప్రజలు మనల్ని ఆదరిస్తారని అన్నారు. నాకు సినిమాల్లో నటన సంపూర్ణంగా ఎప్పుడూ సంతృప్తి ఇవ్వలేదు. అయితే ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడు మాత్రం సంపూర్ణమైన ఆనందం కలిగింది. వచ్చే ఎన్నికల్లో 60 శాతం మంది కొత్త వ్యక్తుల్ని బరిలోకి నిలుపుతాను. ముఖ్యంగా ప్రకాశం జిల్లా వంటి ప్రాంతంలో దీన్ని తూ చా తప్పకుండా పాటిస్తామని పవన్ అన్నారు.