రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మధ్య మరో పొటీ నెలకొంది. ఆ పోటీ పేరే థర్డ్ ఫ్రంట్. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎ, కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఎలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రెండో దఫా ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాంగ్రెస్ రహిత థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అసాధ్యమనే భావిస్తోన్న చంద్రబాబు.. ఆజన్మ శతృవైన హస్తం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ పోటీ- ఇద్దరు చంద్రుల మీద ఉన్న `విశ్వసనీయత`కూ పరీక్షగానే భావించవచ్చు. ఈ విషయంలో కేసీఆర్ ఓ అడుగు ముందే ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనం.
తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తన ప్రయత్నాలకు విరామం ఇచ్చిన కేసీఆర్.. రెండో సారి జాతీయ స్థాయి నేతలతో వరుస భేటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా- ఒడిశా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీలతో సమావేశమయ్యారు. వీరిద్దరితో పాటు డీఎంకే చీఫ్ స్టాలిన్, జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడలతో ఆయన ఇదివరకే సమావేశాలను నిర్వహించారు కూడా. ఆయా భేటీల ఫలితాలు ఇప్పటికిప్పుడు అంచనా వేయడం కష్టతరమే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలకు కాస్త విరామం ఇచ్చారు. ఎన్నికలపై దృష్టి పెట్టారు.సరిగ్గా ఈ విరామ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం ఆవిర్భవించిందో.. ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకునే స్థాయికి దిగజారారు. అక్కడితో ఆగిపోలేదాయన. కాంగ్రెస్ అంటే భగ్గుమనే పార్టీలను కూడా కలుపుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీలను కలిశారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, స్టాలిన్‌తో చర్చలు నిర్వహించారు. ఓ రకంగా చెప్పాలంటే- కాంగ్రెస్ పార్టీకి అధికార దూతగా తయారయ్యారు చంద్రబాబు. యూపీఎలోకి బీజేపీ వ్యతిరేక శక్తులను తీసుకుని రావడానికి చంద్రబాబు చేసిన తొలి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీల పొత్తు దారుణంగా దెబ్బకొట్టింది.రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి కేరాఫ్ అడ్రస్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకుని రావడానికి వైఎస్‌పై ప్రజల్లో ఉన్న విశ్వాసమే కారణం. ఈ విషయాన్ని వైఎస్ పలుమార్లు అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. ప్రస్తుతం కేసీఆర్ కూడా అదే బాటలో అనుసరిస్తున్నారు. చంద్రబాబు విఫలమైన చోట- కేసీఆర్ నెగ్గుకొస్తున్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమే విషయం తెలుగు ప్రజలకే కాదు- జాతీయ స్థాయి నేతలనూ నివ్వెరపరిచింది. కాంగ్రెస్‌తో టీడీపీ జట్టు కట్టడం, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లపై ఐటీ, ఈడీ దాడులు చోటు చేసుకోవడం వంటి పరిణామాలు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ వంటి నేతలను చంద్రబాబుకు దూరం చేసింది. కోల్‌కతలో మమతా బెనర్జీ-చంద్రబాబు మధ్య సమావేశం చప్పగా ముగియడానికి ఈ అంశాలే ప్రధాన కారణాలయ్యాయి. కేసీఆర్ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. తెలంగాణలో 90 సీట్లు సాధించి, మహా కూటమిని మట్టి కరిపించడంతో ఆయన మరోమారు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆ వెంటనే- ఆయన థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లకు దిగారు. తెలంగాణ ఫలితాలు- కాంగ్రెస్ రహిత మూడో ప్రత్యామ్నాయానికి సానుకూల వాతావరణాన్ని కల్పించాయి