ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె బాటపట్టారు. ఉద్యోగవిధానాలపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ 10 ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా వచ్చే వారంలో రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నట్లు బ్యాంకు సంఘాలు వెల్లడించాయి.‘2019 జనవరి 8, 9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ), భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య(బీఈఎఫ్‌ఐ) పిలుపునిచ్చాయి. ఈ సమాచారాన్ని సదరు యూనియన్లు భారత బ్యాంకుల సంఘానికి(ఐబీఏ)కు అందించాయి’ అని బీఎస్‌ఈ ఫైలింగ్ సందర్భంగా ఐడీబీఐ బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.గతేడాది డిసెంబరులోనూ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేసిన విషయం తెలిసిందే. వేతన సవరణ, పెన్షన్‌తో పాటు ఇతర సమస్యల పరిష్కారానికై అఖిల భారత బ్యాంక్ అధికారుల సంఘం (ఏఐబీఓసీ) ఇచ్చిన పిలుపు మేరకు డిసెంబరు 21న బ్యాంకుల అధికారులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది డిసెంబరు 26న సమ్మె చేపట్టారు.