కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయం విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ భిన్నంగా ప్రవర్తిస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మహారాష్ట్రలోని శని సింగాపూర్ ఆలయం విషయంలో కోర్టు తీర్పును బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుందని, కానీ కేరళలో మాత్రం తీర్పును ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నారాయణ శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, ఆయన కంటే డాన్ దావూద్ ఇబ్రహీం బెటర్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శని సింగాపూర్‌లో కోర్టు తీర్పులను పాటించి మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తే.. కేరళ అయ్యప్ప ఆలయం విషయంలో బీజేపీ, వీహెచ్‌పీ, ఆరెస్సెస్‌లు అల్లర్లు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ పాలన ఉన్న రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు ఓ తీరుగా, ఇతర పార్టీల ముఖ్యమంత్రులు ఉన్న చోట భిన్నంగా ప్రవర్తించడాన్ని ఆయన తప్పుపట్టారు. దేశంలో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మరోవైపు, గతేడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది మహిళలు సన్నిధానంలోకి ప్రవేశించారని కేరళ పోలీసులు ప్రకటించారు. ఇందులో ఏ మాత్రం నిజంలేదని, మరింత మంది మహిళలు శబరిమలకు రావాలనే ఉద్దేశంతోనే పోలీసులు ఇలాంటి బూటకపు ప్రకటనలు చేస్తున్నారని శబరిమల కర్మ సమితి మండిపడింది.