ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి నష్టమేనని అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ పొత్తు వికటించిందని, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే కనీసం 50 స్థానాలు గెలుచుకునేదన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో చంద్రబాబు మహాకూటమి కట్టి కేసీఆర్‌కు అధికారం కట్టబెట్టారని ఉండవల్లి అన్నారు. చంద్రబాబును ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని.. ఆయన బోర్న్ ఫైటర్ అని అభివర్ణించారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు మైండ్ గేమ్‌లో భాగమేనని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఎవరూ నేరుగా జేబులో వేసుకోవడానికి కుదరదని, దుర్వినియోగం చేసే అవకాశం మాత్రం ఉంటుందని ఉండవల్లి అన్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని.. ఈ పరిస్థితులను వైసీపీ శ్రేణులు వినియోగించుకోవాలని సూచించారు. అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుకు తాత్కాలిక భవనాలు నిర్మిస్తున్నారని.. ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల్లోనూ అవినీతి పెరిగిపోయిందని.. వాటిని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం మాత్రం అసెంబ్లీకి వెళ్లకుండా విఫలమైందన్నారు. మే నెలలో పోలవరం నుంచి నీరిస్తామని చంద్రబాబు చెబుతున్నా అది సాధ్యం కాదని ఉండవల్లి స్పష్టం చేశారు.