శ్రీవారి వివిధ ఆర్జిత సేవలకు సంబంధించి ఏప్రిల్ నెల టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్ ఉంచింది. మొత్తం 63,311 టిక్కెట్లను శుక్రవారం ఉదయం విడుదల చేసింది. వీటిలో 10,061 టిక్కెట్లను భక్తులకు ఆన్‌లైన్ డిప్ ద్వారీ కేటాయిస్తారు. మిగతా 50 వేలకు పైగా టిక్కెట్లు తక్షణమే బుక్ చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా కేటాయించే వాటిలో సుప్రభాత సేవకు 7,836, తోమాల 130, అర్చన 130, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 1,725 టిక్కెట్లు ఉన్నాయి. ఈ టిక్కెట్ల కోసం భక్తులు మంగళవారం లోపు ఆన్‌లైన్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో జనరల్ కేటగిరిలో 53,250 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 2,500, కల్యాణోత్సవం 11,875, ఊంజల్‌సేవ 3,750, ఆర్జితబ్రహ్మోత్సవం 6,875, వసంతోత్సవం 12,650, సహస్రదీపాలంకారసేవ 15,600 టికెట్లు ఉన్నాయి. తిరుమలలో శుక్రవారం డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమంలో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ ఏప్రిల్ నెల సేవా టిక్కెట్ల గురించి తెలిపారు. జనవరి 8, 22న వయోవృద్ధులు, దివ్యాంగులకు, జనవరి 9, 23న ఐదేళ్లలోపు పిల్లలు, తల్లిదండ్రులకు అదనపు సంఖ్యలో సుపథం మార్గంలో శ్రీవారి దర్శనం కల్పిస్తామని ఈవో వెల్లడించారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు జారీచేసే ఉచిత టోకెన్లను సైతం ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. ‘హైదరాబాద్, కన్యాకుమారిలో నిర్మించిన శ్రీవారి ఆలయాల్లో మార్చి 13, జనవరి 27న స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. అమరావతిలో రూ.150 కోట్లతో నిర్మించనున్న శ్రీవారి ఆలయానికి ఫిబ్రవరి 10న శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏప్రిల్ కోటాను జనవరి 8న విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. రూ.300 టిక్కెట్లను ఆన్‌లైన్, ఈ-దర్శన్, తపాలా కార్యాలయాల నుంచి బుక్ చేసుకోవచ్చని తెలిపారు.