విద్య,వైద్య పట్ల నిర్లక్ష్యం వహిస్తే మానవ మనుగడ ఉండదని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. సమాజంలో విద్య, వైద్యమనేది ప్రతి ఒక్కరికీ అవసరమని గుర్తించాలన్నారు. కాకినాడ పట్టణంలోని రంగరాయ వైద్యకళాశాల 60వ వసంతోత్సవంతో పాటు పూర్వ విద్యార్థుల సంఘం (రాంకోసా) ఏర్పడి 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా సంయుక్తంగా నిర్వహింఛిన వజ్రోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ్‌భారత్ మోదీ కోసం కాదని భారతదేశ భవిష్యత్ కోసమేనన్నారు. విద్యా విధానంలో సమూల మార్పులు తేవాలని కేంద్రం భావిస్తోందన్నారు. ప్రజల్లో ఆంగ్ల భాషపై ఉన్న మోజుతో మాతృభాషకు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజంలో ప్రస్తుతం 48 శాతం యువతీ, యువకులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. వైద్యులు వైద్య సేవలకే పరిమితం కాకుండా యువత పరిణతిపై అవగాహన సదస్సులు నిర్వహించి యువతలో పరివర్తన తేవాలని వైద్యులకు ఆయన సూచించారు.