రజనీకాంత్ తాజా చిత్రం 'పెటా'ను తెలుగులో విడుదల చేస్తున్న వల్లభనేని అశోక్, 10వ తేదీన చిత్ర రిలీజ్ ను ప్లాన్ చేసుకోగా, ఆయనకు థియేటర్ల కొరత ఏర్పడింది. ఈ సంక్రాంతికి బాలకృష్ణ 'ఎన్టీఆర్ - కథానాయకుడు', రామ్ చరణ్ 'వినయ విధేయ రామ'లు విడుదలవుతుండటంతో 80 శాతానికి పైగా థియేటర్లలో ఈ రెండు సినిమాలే ఆడనున్నాయి. ఆపై వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ 'ఎఫ్-2' రానుంది. ఇదే సమయంలో అజిత్ 'విశ్వాసం' కూడా రానుంది. దీంతో 'పెటా'కు థియేటర్లే లభించడం లేదు. రెండు మూడు థియేటర్లు ఉన్న సీ-సెంటర్లలో పెటా విడుదలకే నోచుకోని పరిస్థితి. 10 నుంచి 15 వరకూ థియేటర్లు ఉన్న పట్టణాల్లో కనీసం ఒక థియేటర్ అయినా దక్కుతుందో లేదోనన్న ఆందోళనలో వల్లభనేని అశోక్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నయీమ్ వంటి గ్యాంగ్ స్టర్ ను ఎన్ కౌంటర్ చేసి చంపిన తెలంగాణ ప్రభుత్వం, అల్లు అరవింద్, దిల్ రాజు వంటి థియేటర్ మాఫియాను కూడా షూట్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.