2014 ఎన్నికల సమయంలో అధికారం ఎంత తేడాతో వైసీపీకి తప్పి పోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక, ఇప్పుడు ఎన్నాళ్లో వేచిన ఉదయం సాక్షాత్కరించేందుకు మరో నాలుగు మాసాలే గుడువు ఉంది. ఈ క్రమంలో అప్పటి తప్పులు మళ్లీ చేస్తే..? అప్పటి పరిస్థితి మళ్లీ ఎదురైతే..? ఇప్పుడు ఈ ప్రశ్నలే వైసీపీ సానుభూతిపరులను వేధిస్తున్నాయి. రాజకీయ నేతకు చాలా సంయమనం అవసరం.అదేసమయంలో వ్యూహం మరింత అత్యవసరం. ఏ ఏటి కాడ ఆ పాట పాడితేనే.. నేటి రాజకీయాల్లో అధికార పంట పండేది. రాజకీయాల్లోకి నిన్నగాక మొన్న వచ్చిన నాయకులకు కూడా బాగా తెలుసు. అయితే, జగన్ విషయానికి వస్తే.. మాత్రం.. ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో వెనుకబడుతున్నాడనే వ్యాఖ్యలు, విశ్లేషణలు, విమర్శలు కూడా వస్తున్నాయి. రాజకీయ మేధావులు తరచూ ఒక మాట చెబుతూ ఉంటారు. మనకు రాజకీయం వచ్చు.. మన ప్రత్యర్థికి రాజకీయ చతురత వచ్చు. మనం ఎందుకు అతన్ని చూసి నేర్చుకోకూడదు! అని! ఎప్పటికప్పుడు రంగులు మారుస్తూ.. ప్రజలను ఆ రంగుల అద్దాల్లో ముచ్చట తీర్చుకునేలా మురిపెంగా దువ్వగలిగితేనే.. రాజకీయ పండుతుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు!తెలంగాణా ఎన్నికల సమయంలో బాబు అక్కడకి అడుగు పెట్టక ముందు.. పెట్టిన తర్వాత కేసీఆర్ వ్యూహం ఎలా మారిపోయిందో.. కొంచెం సూక్షంగా పరిశీలిస్తే.. ఇట్టే అర్ధమవుతుంది! తమ గెలుపే పరమావధిగా కేసీఆర్ వ్యూహాన్ని రాత్రికి రాత్రి మార్చుకుని ప్రజల్లోకి వెళ్లారు. ఇది ఆయన కు అనుకూలించింది.ఏపీ విషయానికి వస్తే.. ప్రత్యేక హోదా వద్దన్న నోటితో.. మోడీ దేవుడు, రాముడిని మించిన రాముడు అని పొగిడిన నోటి తోనే ఇప్పుడు హోదా కావాలని, ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబునాయుడు. మోడీని పొగిడిన నోటితోనే నేడు నానా మాటలు అంటున్నారు. అంటే.. ప్రజల కోణంలోనే ఈ ఇద్దరు నేతలు కూడా తమ రాజకీయాలను చేస్తున్నారు. ప్రజలు ఎటు మళ్లితే.. అటు తమ రాజకీయాలను మార్చుకుంటున్నారు. ప్రజలకు ఏది తియ్యగా ఉంటుందని భావిస్తే.. దానినే ఈ నేతలు చేదుగా ఉన్నప్పటికీ అధికారం కోసం భరిస్తున్నారు. మరి క్రమంలోనే నిన్న మొన్నటి వరకు తిట్టిపోసిన పవన్ కళ్యాణ్‌ను, జనసేన పార్టీని కూడా కలుపుకొని పోతామంటూ.. చంద్రబాబు ప్రకటనలు చేసే పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటి వారితో పోల్చుకుంటే.. జగన్ కొంతమేరకు భేషజాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కాల్సిన అవసరం వైసీపీకి ఎంతైనా ఉంది. ఇప్పటికే ఆర్థికంగా, నాయకుల పరంగా కూడా జగన్ తీవ్ర ఇబ్బందుల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో ఆయన వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తేనే ఇన్నాళ్లుగా తను దేనికైతే ఎదురు చూస్తున్నారో అది దక్కుతుందనేది వాస్తవం. ఈ క్రమంలోనే ఆయన తన సొంత బలం ఉందని, తనకు ఇక గెలుపు ఖాయమని భావిస్తున్న ఊహల నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు విశ్లేషకులు. రోజులు మారాయని అంటు న్నారు. గతంలో వైఎస్ పాదయాత్ర చేసిన ప్పటి రోజులకు ఇప్పుడు ఉన్న రోజులకు చాలా తేడా ఉందని చెబుతున్నారు. 2004లోనే వైఎస్ చంద్రబాబును తట్టుకునేందుకు పాదయాత్ర చేసినా కూడా వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్లారు తప్పితే.. ఒంటరిగా మాత్రం సాహసం చేయలేదు. ఫలితంగా ఆయన అధికారంలోకి వచ్చారు. ఇది 2009లో మరింత బలోపేతం అయ్యేందుకు, పార్టీని బలోపేతం చేసుకునేందుకు కూడా దోహద పడింది. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ కూడా ఇలాంటి దూర దృష్టితో కూడిన ఆలోచన చేసి ఉంటే.. బాగుండేదని ఎన్నికల అనంతరం విశ్లేషణలు సాగాయి. అప్పటి ఎన్నిక ల్లో రైతు, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తాను అధికారంలోకి వస్తే.. తీరుస్తానని మాటిచ్చారు. అయితే, ఈ విషయంలో జగన్ లెక్కలు చెప్పారు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి హామీలు ఇచ్చి ప్రజలను నేను మోసం చేయలేనని చెప్పారు. కానీ, జగన్ ఊసును పట్టించుకున్న వారు ఒక్కరు కూడాలేరు.వాస్తవ రాజకీయాలను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో కనిపించడం లేదన్న విషయాన్ని జగన్ గుర్తించాలి. తను సొంత బలంతోనే గెలిచేస్తానని ఆయన అనుకుంటే అది చాలా ఇబ్బంది కరమనే విశ్లేషణలు వస్తున్నాయి. అలా కాకుండా తనకు అందివచ్చిన బలమైన నేతతో అవగాహన కుదుర్చుకుంటే తప్పేమీ ఉండదని కూడా చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలు కులాలు, వర్గాలు, ప్రాంతాల వారీగానే రాజకీయాలకు ఇష్టపడుతున్నారు. ఇలా ఎందుకు అంటే? ఎవరి అభిరుచులు, ఎవరి లక్ష్యాలు వారికి ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలు నేరుగా ఏ ఒక్కరి పక్షానో నిలబడే ఛాన్స్ చాలా తక్కువగా కనిపిస్తోంది. అంటే.. ఏ ఒక్క పార్టీకి మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో ఆయన జట్టుకు సై అంటున్నారు. మరి ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తేనే తప్ప.. తనకు ఫ్యూచర్ లేదనే విషయం తెలిసి కూడా జగన్ వ్యవహరిస్తున్న తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. తనతో కలిసి ముందుకు నడిచేందుకు ముందుకు వచ్చిన ఓ కొత్తపార్టీతో ఆయన జట్టుకు సిద్ధమైతే.. అధికారంలోకి వచ్చే అవకాశం మెండుగా ఉంటుందనే విషయాన్ని కూడా జగన్ విడిచి పెట్టడం ఎందుకనే భావన వ్యక్తమవుతోంది.జగన్‌పై రాజకీయంగానే కాకుండా మానసికంగా దెబ్బ వేసేందుకు అధికార పార్టీ టీడీపీ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంది. ఈ ప్రచారం ఉధృతం అయితే.. జగన్ ఒక్కడే దీనిని తట్టుకునే పరిస్థితి ఉండడం కష్టం. ఈ నేపథ్యంలో ఆయనకు తోడుగా మరికొందరు, మరికొన్ని పార్టీలు కూడాకలిసి వస్తే.. అందుకోవాలనుకుంటున్న అధికార చందమామ అందడం చాలా తేలిక. ఈవిషయంలో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుని అధికారంలోకి రావడం జగన్ ముందున్న ఏకైక మార్గం. దీనిని కాదనుకుని. అతిగా వ్యవహరిస్తే.. ఆయన తనంతట తానే కష్టాలు కొనితెచ్చుకున్నట్టు అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. మరి జగన్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.