నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఆయన హీరోగా పరిచయం కాబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ కోసం ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ను సిద్ధం చేశానని, బాలకృష్ణ అంగీకరిస్తే ఆయన తనయుడిని వెండితెరకు పరిచయం చేస్తానని సింగీతం శ్రీనివాస్ గతంలో చెప్పారు. బాలకృష్ణ సైతం తన కుమారుడి సినిమా వచ్చే ఏడాది ఉంటుందని 2017లోనే ప్రకటించారు. కానీ, ఇవేవీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఆఖరికి ‘యన్.టి.ఆర్’ సినిమాలో బాలకృష్ణ పాత్రను మోక్షజ్ఞ పోషించారనే వార్త కూడా వినిపించింది. కానీ దీనిలోనూ నిజం లేదని తెలుస్తోంది. ఏదేమైనా త్వరలోనే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఖాయమనే వార్త అయితే మాత్రం ఫిల్మ్ నగర్‌లో బలంగా వినిపిస్తోంది. దీంతో మోక్షజ్ఞ తొలి సినిమాకు దర్శకత్వం వహించేదెవరనే చర్చ ప్రేక్షకుల్లో మొదలైంది. బోయపాటి, పూరి జగన్నాథ్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే తనకు ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన బోయపాటి వైపే బాలయ్య మొగ్గుచూపుతారనేది చాలా మంది మాట. కానీ, బోయపాటి మాత్రం దీనికి సిద్ధంగా లేరు. మోక్షజ్ఞ తొలి సినిమా తనతో చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ‘మోక్షజ్ఞ తొలి సినిమాకు నేను దర్శకత్వం వహిస్తాననే రూమర్లు బయట వినిపిస్తున్నాయి. వాటిలో నిజం లేదు. మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతాయి. అందుకే మోక్షజ్ఞతో తొలి సినిమా నేను చేయాలనుకోవడం లేదు. అతని మూడు లేదా నాలుగో సినిమా నేను చేస్తానని భావిస్తున్నాను’ అని బోయపాటి స్పష్టత ఇచ్చారు. అలాగే చిరంజీవి సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం చిరంజీవి గారు రెండు సినిమాలు ఒప్పుకున్నారు. అవి పూర్తయిన తరువాత నా సినిమా ఉంటుంది. ఓ లైన్ అనుకున్నాం.. దాన్ని స్క్రిప్ట్ రూపంలో తీసుకురావాలి’ అని చెప్పారు.