YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పక్క చూపులు చూస్తున్న కమలం నేతలు

పక్క చూపులు చూస్తున్న కమలం నేతలు
చంద్రబాబునాయుడు దెబ్బకో…. ఏపీ విభజన హామీలను అమలు చేయకో తెలియదు కాని ఆంధ్రప్రదేశ్ లో కమలం పార్టీ కుదేలై పోవడం ఖాయంగా కన్పిస్తుంది. ఏపీలో ఇప్పుడు ప్రధాన దోషి భారతీయ జనతా పార్టీ మాత్రమే. అటువంటి పార్టీలో గత ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. తెలుగుదేశంపార్టీతో పొత్తు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహకారంతో కొన్ని స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ఏపీలో బీజేపీకి నూకలు చెల్లాయన్న వార్తలతో వారిలో ఎందరు మిగులుతారన్న ప్రశ్న తలెత్తుతోంది.ఎన్నికల్లో విశాఖపట్నం ఉత్తరం, రాజమండ్రి అర్బన్, తాడేపల్లి గూడెం, కైకలూరు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. టీడీపీ, బీజేపీకి చెడిపోవడంతో ఇప్పుడు ఒంటరిగా గెలిచే సత్తా బీజేపీకి లేదని తేలిపోయింది. దీంతో బీజేపీ నేతలు పక్క చూపులు చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మాజీ మంత్రి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మాణిక్యాలరావు చంద్రబాబు హామీలను అమలు చేయలేదని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాన్ని ఇంకా ఆమోదించనప్పటికీ ఆయన తాను ఎమ్మెల్యేగా లేననే ప్రజలకు చెబుతున్నారు.కైకలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన మాత్రం తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. దీంతో కైకలూరు స్థానం కూడా బీజేపీకి దాదాపు ఖాళీ అయినట్లే. ఇక తాజాగా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పక్క చూపులు చూస్తున్నారు. ఆయన వైసీపీలోకి వెళ్లేది లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ టీడీపీలో చేరడం ఖయమేనన్నది స్పష్టమైపోయింది. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా జనసేనలోకి జంప్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆకుల సత్యనారాయణ సతీమణి ఆకుల పద్మావతి ఇప్పటకే జనసేన పార్టీలో చేరి కీలకంగా మారారు. వచ్చే ఎన్నికలలో ఆకుల సత్యనారాయణ రాజమండ్రి పార్లమెంటు స్థానానికి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఆయన ఇప్పటికే జనసేన నేతలతో చర్చించినట్లు వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతుంది. ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. సంక్రాంతి తర్వాత మంచిరోజు చూసుకుని ఆయన జనసేన పార్టీలో చేరేందుకు రెడీ అయిపోయారు. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో ముందుగానే పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు ఆకుల. ఇక బీజేపీలో గత ఎన్నికల్లో గెలిచిన వారిలో ఎంతమంది మిగులుతారన్నది ప్రశ్నార్థకమే.

Related Posts