కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసి బయటకు వచ్చిన వట్టి వసంత్ కుమార్ ఎందుకు సైలెంట్ అయ్యారు. ఆయన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించకపోవడానికి కారణాలేంటి? ఇప్పుడు ఇదే చర్చ ఉంగుటూరు నియోజకవర్గంలో జరుగుతుంది. వట్టి వసంతకుమార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఇందుకు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అటువంటి వట్టి వసంతకుమార్ దాదాపు నెలన్నర క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేశారు.అయితే తన రాజీనామాకు గల కారణాన్ని కూడా వట్టి అప్పట్లో వివరించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తు కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనభవిష్యత్ కార్యాచరణను డిసెంబరు 11వ తేదీతర్వాత ప్రకటిస్తానని కూడా చెప్పారు. కాని ఆయన చెప్పి నెల రోజులు గడుస్తున్నా భవిష్యత్ కార్యాచరణను ప్రకటించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వట్టి వసంతకుమార్ తొలుత జనసేనలో చేరతారని భావించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను స్వయంగా కలవడంతో ఈ వార్తలు గుప్పుమన్నాయి.కానీ కాంగ్రెస్ రాజీనామా చేసిన తర్వాత మాత్రం ఆయన మనసు వైసీపీ వైపు మొగ్గు చూపిందంటున్నారు. కేవీపీ సూచనలతోనే ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అంతకుముందే కాంగ్రస్ పార్టీ కి రాజీనామా చేసిన సీనియర్ నేత సి.రామచంద్రయ్య వైసీపీలో చేరిపోయారు. కానీ వట్టి ఇంతవరకూ చేరకపోవడానికి కారణాలేంటన్నదానిపై చర్చ జరుగుతోంది. జగన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా? లేక డిసెంబరు 11వ తేదీ తర్వాత రాష్ట్ర, దేశ రాజకీయాల్లో మారిన పరిస్థితులతో వట్టి తన మనసు మార్చుకున్నారా? అన్నది తెలియరావడం లేదు.వట్టి వసంతకుమార్ మాత్రం తన అనుచరులు, సన్నిహితులు, ముఖ్యులతో చర్చించిన తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తానని చెబుతున్నారు. అయితే ఇందులో మరో వాదన కూడా వినపడుతోంది. ఇప్పుడు పార్టీలో చేరేందుకు మంచి రోజులు లేవని, సంక్రాంతి తర్వాత తమ నేత ఏ పార్టీలోచేరనున్నదీ ప్రకటిస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైనప్పటికీ, మంచి రోజుల కోసమే ఆయన ఆగారంటున్నారు. మొత్తం మీద వట్టి వసంతకుమార్ మౌనంగా ఉండటంపై పలు అర్థాలు తీస్తున్నారు. సంక్రాంతి తర్వాతైనా వట్టి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది