YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సంక్రాంతి తర్వాత బాబు మొదటి లిస్ట్

సంక్రాంతి తర్వాత బాబు మొదటి లిస్ట్
సంక్రాంతి తర్వాత పందెంకోళ్లను రెడీ చేస్తున్నారు చంద్రబాబునాయుడు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఎన్నికల్లో కొంత దూకుడుగానే వెళ్లాలని యోచిస్తున్నారు. అందుకే అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేశారు. ఒకవైపు జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల్లో నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు చంద్రబాబు రేయింబవళ్లూ ప్రయత్నిస్తున్నారు. తొలిజాబితాలో దాదాపు నలభై మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశముందంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు జాబితా విడుదలకంటే ముందే సంక్రాంతి పండగ తర్వాత పెద్దయెత్తున పార్టీలో చేరికలు ఉండేందుకూ కసరత్తులు చేస్తున్నారు. అభ్యర్థుల జాబితాలకంటే ముందుగానే చేరికలు భారీగా ఉంటే పార్టీలోనూ తన ఎంపికను ప్రశ్నించరన్న ఆలోచనలో అధినేత ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం చేరికల లిస్టును కూడా తయారీ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అక్కడి స్థానిక కారణాల వల్ల వారి చేరికను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో చేరికలు ఖచ్చితంగా ఉంటాయని, ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా వినబోనని నేతలకు తేల్చిచెప్పినట్లు సమాచారం.తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సీనియర్ నేతలు సబ్బం హరి, కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, డీఎల్ రవీంద్రారెడ్డిలతో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరినీ సంక్రాతి తర్వాత మంచి రోజు చూసుకుని పార్టీ కండువాను కప్పేందుకు సిద్ధమవుతున్నారు. అందరినీ ఒకేసారి అమరావతిలో పెద్ద సభ పెట్టి చేర్చుకోవాలా…? విడతల వారీగా చేర్చుకోవాలా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాకున్నా సంక్రాంతి తర్వాత పెద్దయెత్తున టీడీపీలో చేరికలుంటాయని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఎన్నికల సమయంలో చేరికలు మరింత బలాన్నిస్తాయన్నది బాబు నమ్మకం. ఒకవైపు అభ్యర్థుల ఎంపిక, చేరికల కారణంగా పార్టీలో అసంతృప్తి తలెత్తకుండా చూసుకోవడంతో పాటు జనంలో పట్టున్న, రాష్ట్రస్థాయిలో పేరున్న నేతలను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా గెలుపు ఖాయమన్న ధీమాలో ఆయన ఉన్నారు. ఇప్పటికే కొందరికి సంక్రాంతి తర్వాత చేరేందుకు సిద్ధమవ్వాలన్న సమాచారం కూడా వెళ్లిందంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఒంటరిగానా? కాంగ్రెస్ తో కలసి వెళ్లాలా? అన్న దానిపై నిర్ణయం తీసుకోకముందే చేరికలుంటే బావుంటుందని పలువురు సీనియర్ల సూచన మేరకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఒకవైపు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ముగించుకుని బస్సుయాత్రకు సిద్ధమవుతుండటం, జనసేనాని ఒంటరిగా బరిలోకి దిగుతానని చెప్పడంతో బాబు క్విక్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. మొత్తం మీద సంక్రాంతి పండగ తర్వాత పసుపు పార్టీ చేరికలతో కళకళలాడుతుందన్న మాట.

Related Posts