మెక్సికో సరిహద్దులో గోడ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. మెక్సికోతో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధులు కేటాయిస్తేనే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదిస్తానని ట్రంప్ పట్టుబట్టడం.. అందుకు డెమోక్రటిక్ నేతలు అంగకరించకపోవడంతో అక్కడ పాక్షిక షట్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గోడకు బదులుగా స్టీల్‌తో దృఢమైన కంచె ఏర్పాటు చేయాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది.ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. అమెరికా పాక్షిక షట్‌డౌన్ ముగించేందుకు తన యంత్రాంగం, డెమోక్రటిక్ పార్టీ నేతలతో చర్చలు జరుపుతోందని ట్రంప్ వెల్లడించారు. త్వరలో సమస్య పరిష్కారమవుతుందన్నారు. ఈ విషయంలో డెమోక్రటిక్ నేతలు కూడా పట్టుదలతో ఉండడంతో షట్‌డౌన్ ముగించేందుకు ట్రంప్ కాస్త తన పట్టు వీడారు. ‘‘మేము ప్రస్తుతం సరిహద్దులో కాంక్రీటు గోడకు బదులుగా స్టీలు కంచె ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేస్తున్నాం. ఇది దృఢంగా ఉండడమే కాకుండా వలసలను అడ్డుకుంటుంది. ఇదే మంచి పరిష్కారం. స్టీలు కంచెను అమెరికాలోనే తయారుచేస్తాం’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, పలువురు కీలక డెమోక్రటిక్ నేతలతో చర్చలు అనంతరం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. డెమోక్రాట్లకు, పెన్స్‌కు జరిగిన సమావేశం ఫలవంతంగా జరిగిందని ట్రంప్ తెలిపారు. సరిహద్దు రక్షణ గురించి చాలా అంశాలు చర్చించినట్లు చెప్పారు. స్టీలు కంచె విషయంపై కూడా చాలా మంది అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. కాంక్రీటు గోడ నిర్మాణాన్ని డెమోక్రాట్లు ఇష్టపడడం లేదని, అందుకే స్టీలు కంచె నిర్మించనున్నట్లు తెలిపారు. వాస్తవంగా కాంక్రీటు గోడ కంటే స్టీలు కంచెకే ఎక్కువ ఖర్చువుతుందని, కానీ దృఢంగా చాలా బాగుంటుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.