YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

జనమే జగన్..

Highlights

  • పాపం... జగన్
  • జగన్ కు ఈ లోకం తీరు తెలియదు
  • సిబిఐ ధృతరాష్ట్ర కౌగిలిలో జగన్ 
జనమే జగన్..

లలిత్ మోడీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ... వీరంతా ఘరానా పెద్ద మనుషులు.  ప్రధానమంత్రులతో కలిసిమెలిసి, రాసుకుని పూసుకుని తిరుగుతుంటారు.  వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటారు.  ఒక శుభముహూర్తంలో 'మూడో కంటికి తెలియకుండా' విదేశాలకు చెక్కేస్తారు.  వాళ్ళు చెక్కేశారని మన ఘనత వహించిన ప్రభుత్వాలకు ఏ నెలరోజులకో తెలుస్తుంది.  అప్పుడు తెగ హాశ్చర్యపోతారు.  ప్రపంచంలో ఎక్కడున్నా, సప్తసముద్రాల అడుగున దాక్కున్నా, జుట్టు పట్టుకుని లాక్కొస్తామని, వారు దోచుకున్న ప్రజాధనాన్ని కక్కిస్తామని భీషణ ప్రతిజ్ఞలు చేస్తారు.  నేరమంతా అధికారుల మీద నెట్టేస్తారు.  తాము పత్తిత్తులమని ఫోజులు కొడతారు.  అదేమంటే.. ఇదంతా అరవై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పాపమే అని నిస్సిగ్గుగా బొంకుతారు.

పాపం... జగన్ కు ఈ లోకం తీరు తెలియదు.  అందుకనే కేసులు పెట్టగానే నోరు మూసుకుని జైలుకు వెళ్లి కూర్చున్నాడు.  కేసులు పెడుతున్నారని తెలియగానే హాయిగా విజయ్ మాల్యా లాగా లండనో, స్విట్జర్లాండ్ చెక్కెయ్యవచ్చు కదా?  ఆఫ్ట్రాల్ పదివేల కోట్లు కాజేసిన మాల్యా, నీరవ్ మోడీ చెప్పా పెట్టకుండా మూటా ముల్లె సర్దేసుకుని విమానాలు ఎక్కగా లేనిది, లక్ష కోట్లు కాజేసిన జగన్ చంద్రమండలమే వెళ్లి అక్కడ కాపురం పెట్టుకోకుండా తెలివితక్కువగా సిబిఐ ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కడం పొరపాటు కదా!!

ఎంత కారుడు గట్టిన ఉగ్రవాది కైనా తొంభై రోజుల్లో బెయిల్ ఇవ్వాలని రాజ్యాంగం చెబుతున్నదిట.  నాకు తెలియదు కానీ, కనీసం 180  రోజుల్లో అయినా బెయిల్ రావాలి కదా?  మరి 16    నెలలు జగన్ కు బెయిల్ ఎందుకు రాలేదు?  16  నెలల తరువాత కూడా సిబిఐ జగన్ కాజేసిన లక్ష కోట్లనుంచి గడ్డిపరక కూడా పీకలేనపుడు మరి జగన్ ను దోపిడీ చేసాడని నక్కలు ఊళలు వేసినట్లు, గాడిదలు ఓండ్రపెట్టినట్లు తెలుగుదేశం వారు కేకలు పెడుతుంటే సిబిఐ, న్యాయస్థానాలు ఏమి చేస్తున్నాయి?  కోర్టు విచారణలో ఉన్న కేసుల గూర్చి, నిందితుడి గూర్చి వ్యాఖ్యానాలు, కువిమర్శలు చేస్తుంటే అది కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని ఒక్క మేధావి కూడా చెప్పలేకపోయాడు!

ఆరోపణలు వచ్చిన ప్రతివాడు నేరస్తుడు కాదు.  అలా అయితే ఈ దేశంలో నేరస్తుడు కాని రాజకీయ నాయకుడు ఎవడూ లేడు.  ఆరోపణలు వచ్చిన ప్రతివారినీ జైల్లో పెట్టాలంటే ఈ దేశంలో ఉన్న కారాగారాల్లో చోటు మిగలదు.  ఆరోపణలు రుజువు కాకపోయినా, నేరగాడు అని బురద చల్లడం అత్యంత హేయం.  నేర నిరూపణ జరిగే వరకూ, కోర్టు ప్రకటించేవరకు ఎవ్వరి వ్యక్తిత్వాన్ని హననం చేసే హక్కు ఎవ్వరికీ లేదు.  ఈ దేశంలో ఉన్న కోట్లాదిమంది లో జగన్ ఒకరు.  నేరం రుజువు అయితే న్యాయస్థానం అతడిని శిక్షిస్తుంది.  

కానీ, మానసికంగా ఎంత శిక్షిస్తున్నా, ఎంత హేళన చేస్తున్నా, చలించకపోవడమే జగన్ లో కనిపిస్తున్న సుగుణం.   ఎవ్వరినీ లెక్కచెయ్యని గజరాజులా ఈరోజు వీధుల్లో పులిపిల్లలా సంచరిస్తున్నాడు.  ప్రజలు అతని చుట్టూ మూగుతున్నారు.  తమ కష్టాలు చెప్పుకుంటున్నారు.  అతడైతే తమ ఇక్కట్లను నివారించగలదని నమ్ముతున్నారు.  రాబోయే ఎన్నికల్లో వారి తీర్పు ఇస్తారు.  అంతవరకు శునకాలు మొరగకుండా ఉంటె వారి పరువు నిలబడుతుంది.  లేకపోతె రేపు వారు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సివస్తుంది.

వ్యాసకర్త :: ఇలపావులూరి గారు, హైదరాబాద్. ( ఇందులోని సారాంశమంత పూర్తిగా వ్యాకర్త వ్యక్తి గత అభిప్రాయం మాత్రమే.)

Related Posts