ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ విజయం.. టీమిండియాకి లభించిన గొప్ప గెలుపని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ఈరోజు ముగిసిన నాలుగో టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగియగా.. భారత్ జట్టు 2-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. 72 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్‌లో గెలుపొందగా.. ఈ ఘనత సాధించిన తొలి భారత, ఆసియా కెప్టెన్‌గానూ కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. కెప్టెన్‌గా తానెంతో గర్విస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ‘భారత్ జట్టుకి ఇంతకంటే గొప్ప విజయం మరొకటి ఉండదు. గత 12 నెలలుగా జట్టులో ఈ గెలుపు సంప్రదాయాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాం. నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపైనే నేను తొలిసారి టెస్టు కెప్టెన్‌గా జట్టు బాధ్యతలు అందుకున్నా. ఇప్పుడు గొప్ప ఆటగాళ్లతో నిండిన జట్టుని నడిపిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను’ అని విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. 2014-15లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో భారత టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్రసింగ్ ధోనీ అనూహ్యంగా తప్పుకోగా.. ఆఖరి టెస్టులో కోహ్లీ చేతికి పగ్గాలొచ్చాయి. అయితే ఆ పర్యటనలో కోహ్లీ నాలుగు శతకాలు బాదినా.. టీమిండియా సిరీస్‌లో ఓడిపోయింది. తాజా సిరీస్‌లోనూ పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సెంచరీ సాధించినా.. ఆ మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోయింది. కానీ.. పుజారా మూడు శతకాలు సాధించగా.. రెండు టెస్టుల్లో గెలుపొందిన భారత్.. ఈరోజు ముగిసిన ఆఖరి టెస్టుని డ్రాగా ముగించడం కొసమెరుపు..